గోవాలో జరిగిన ఇద్దరు మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్ మరియు ఇద్దరు మైనర్ బాలురపై దాడి కేసు విషయమై అసెంబ్లీ వేదికగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతవారం గోవాలో జరిగిన ఇద్దరు మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్ మరియు ఇద్దరు మైనర్ బాలురపై దాడి కేసు విషయమై అసెంబ్లీ వేదికగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
హోం మంత్రిత్వ శాఖ కూడా తన వద్దే ఉంచుకున్న ప్రమోద్ సావంత్.. మైనర్ బాలికలకు రాత్రి పూట బీచ్‌ల్లో ఏం పని అని ప్రశ్నించారు. అర్ధరాత్రి వేళ పిల్లలు బయటకు వెళ్లడానికి అనుమతించడంపై అసెంబ్లీ వేదికగా ఆయన వారి తల్లిదండ్రులని నిందించారు.అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ..10 మంది పిల్లలు బీచ్‌లో పార్టీ చేసుకునేందుకు సౌత్ గోవాలోని కోవ్లా బీచ్ కి వెళ్లారు. ఆ పది మందిలో ఆరుగురు తిరిగి ఇంటికి చేరుకున్నారు.
కానీ ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు మాత్రం రాత్రంతా బీచ్‌లోనే గడిపారు. అర్ధరాత్రి పూట బీచ్‌లోనే ఉండాల్సిన అవసరమేంటి? 14 ఏళ్ల పిల్లలు అక్కడ ఉన్నారంటే వారి తల్లిదండ్రులు దానిపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారు జాగ్రత్త వహించాలి. పిల్లలు తల్లిదండ్రుల మాట వినలేదని..ఆ బాధ్యతనంతా పోలీసులపై వదిలేయలేం అని ప్రమోద్ సావంత్ వ్యాఖ్యానించారు. రాత్రిపూట ఆడపిల్లలు బయటకు వెళ్లడానికి అనుమతించరాదని, మరీ ముఖ్యంగా వారు మైనర్లుగా ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలంటూ హితవు పలికారు.
అయితే అమ్మాయిల విషయంలో సీఎం ప్రమోద్ సావంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన తీరుపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. గోవాలో అర్ధరాత్రి పూట స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు ఉండాలని.. అది గోవా బ్రాండ్ ఇమేజ్ అని స్పష్టం చేస్తున్నారు. బీజేపీ పాలనలో గోవా మహిళలకు మరింత ప్రమాదకరంగా మారిందని విమర్శించారు. అర్ధరాత్రి తిరిగినా ఏం కాదనే భరోసా ఇవ్వాలి తప్ప.. బాధితులను నిందించడం కరెక్టు కాదని విమర్శిస్తున్నారు.
సీఎం స్థాయిలో ఉండి అలా మాట్లాడడం సిగ్గు చేటని దుమ్మెత్తిపోస్తున్నారు. కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా ట్విటర్ వేదికగా స్పందిస్తూ..ఇటువంటి జ్ణానం ఉన్న ముఖ్యమంత్రి తన పదవి నుంచి వైదొలిగి, ఇంటికి వెళ్లాలి అంటూ మండిపడ్డారు.అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. పనాజీకి 30 కిలోమీటర్ల దూరంలోని కోవ్లా బీచ్‌లో ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం జరిగింది. వారి వెంట ఉన్న ఇద్దరు బాలురు దాడికి గురయ్యారు.
ఈ ఘటనలో ఇప్పటికే నలుగురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేప్ కేసుతో సంబంధమున్న అసిఫ్ హతేలి (21), రాజేశ్ మానే (33), గజానంద్ చించంకర్ (31), నితిన్ యబ్బల్ (19) అనే యువకులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.