నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుతుంటాయి. ఏదైనా ప్రమాదం జరిగితే నష్టం జరిగిన వారికి పరిహారం చెల్లిస్తారు.పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం కూడా ప్రజలకు నష్టపరిహారం చెల్లిస్తుంది. అది ప్రమాద తీవ్రతను బట్టి నిర్ణయిస్తారు. ఈ క్రమంలో దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఇచ్చి వారికి సంబంధించిన వివరాలను సేకరించి నిర్ధారిస్తారు. కన్ఫర్‌మేషన్ తర్వాత పరిహారం చెందవలసిన వారికి చేరుతుంది. కానీ శవాల మీద పేలాలు ఏరుకునే కొంతమంది డబ్బు కోసం దేనికైనా సిద్ధపడతారు. ఇందుకు ఉదాహరణ ఒడిశా ఘటనలో మృతి చెందినవారిని తమ బంధువులంటూ కొంతమంది సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
ఇటీవల జరిగిన ఒడిశా రైలు ప్రమాదంలో ఎంతోమంది కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. మృతదేహాలను గుర్తించలేని స్థితిలో ఉంటే కొంతమంది స్వార్థపరులు మృతులకు ప్రభుత్వం చెల్లించే పరిహారం కోసం నాటకాలకు తెరలేపారు. ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి తమ కుటుంబానికి చెందిన వ్యక్తే అని నమ్మబలికి మృతదేహాలను తీసుకుంటున్నారు. అలాంటి సంఘటన కటక్‌కు చెందిన మహిళ ద్వారా బయటపడింది. తన భర్త రైల్లో ప్రయాణించాడని నమ్మబలికి నష్టపరిహారం కొట్టేయాలని చూసింది. అదికాస్త బెడిసికొట్టింది. పూర్తి వివరాలలోకి వెళితే..
కటక్ కు చెందిన గీతాంజలి దత్తా అనే మహిళ ఆదివారం బాలేశ్వర్ వెళ్లింది. అక్కడ మృతుల ఫొటోలను ఉంచిన ప్రదేశానికి చేరుకుంది. ఒడిశా రైలు ప్రమాదం జరిగినప్పుడు తన భర్త రైల్లో ఉన్నాడని, అతని వివరాలు ఇప్పటివరకు తెలియలేదని పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఫొటోలను చూపించగా.. ఒక ఫొటోను చూపించి తన భర్త అని చెప్పింది. ఆమె వ్యవహరించిన తీరుపై అనుమానం వచ్చి పోలీసులు పూర్తి వివరాలను సేకరించారు. విచారణలో ఆమె భర్త చనిపోలేదని.. బతికే ఉన్నాడని నిర్ధారణ అయ్యింది. దీంతో సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించగా ప్రభుత్వం చెల్లించే పరిహారం కోసం ఇలా చేశానని ఒప్పుకుంది. ఒడిశా ప్రభుత్వం ఈ ఘటనపై అప్రమత్తమైంది. మోసాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ ఘటనపై మీ కామెంట్‌ను తెలియజేయండి.