దేశవ్యాప్తంగా ప్రజల్ని తీవ్రంగా కలచివేసిన ఒడిశా పెను ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటనేది బయటపడింది. రైళ్లు సేఫ్‌గా నడపడంలో అత్యంత కీలకమైన ‘ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్’లో మార్పులు చేయడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని తేలింది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, విధ్వంసం సృష్టించే ఆలోచనతోనే ఇలా చేశారా అనేది తేల్చేందుకు సీబీఐని రంగంలోకి దించనున్నారు. ఈ ఘోర ప్రమాదంలో రైళ్లను నడుపుతున్న లోకోపైలట్ల (డ్రైవర్ల) తప్పు లేదని ఉన్నతాధికార వర్గాలు క్లీన్ చిట్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో రైలు పట్టాలు మారుతూ వెళ్లడంలో ఇంటర్‌లాకింగ్ వ్యవస్థే ప్రధానంగా మారింది. ఈ అంశంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. తమ విచారణ పూర్తయిందన్న ఆయన.. ఈ యాక్సిడెంట్‌కు మూల కారణమేమిటి, దీనికి బాధ్యులు ఎవరనేది తేలిందని చెప్పారు. పాయింట్ మెషీన్ సెట్టింగ్‌ను మార్చడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు.
పాయింట్ మెషీన్ సెట్టింగ్ ఎవరు మార్చారు, ఎలా మార్చారనేది రైల్వే భద్రత కమిషనర్ (సీఆర్ఎస్) దర్యాప్తు రిపోర్టులో బయటపడుతుందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. యాక్సిడెంట్ ఘటనపై సీబీఐ ఇన్వెస్టిగేషన్‌కు రైల్వే బోర్డు సిఫార్సు చేసిందన్నారు. ఇకపోతే, ప్రమాదానికి కీలకంగా భావిస్తున్న ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌ను ఎవరు మార్చారు? ఎందుకిలా చేశారు? ఇది కావాలనే చేసిన కుట్రా? దీని వెనుక ఏమైనా భారీ స్కెచ్ ఉందా? అనే ప్రశ్నలు రైల్వే అధికారులను వేధిస్తున్నాయి. విధ్వంసం సృష్టించాలనే దురుద్దేశంతోనే కొందరు వ్యక్తులు.. ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లో మార్పులు చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. మామూలుగా అయితే ఆ వ్యవస్థలో పొరపాటు జరిగేందుకు ఛాన్స్ లేదని.. కానీ నిజం ఏంటనేది సీబీఐ విచారణలో బయటపడుతుందని అంటున్నారు. కాగా, ఒకే పట్టాల మీదకు ఏకకాలంలో రెండు రైళ్లు రాకుండా మార్గం సుగమం చేసేందుకు ఉద్దేశించిన సమగ్రమైన సిగ్నల్ వ్యవస్థను ‘ఇంటర్‌లాకింగ్’ అని అంటారు.