ఎన్నికల్లో గెలుపు కోసం.. రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆచరణకు సాధ్యం కానీ హామీలు, నగదు పంపిణీ, మద్యం పంచడం తదితర విషయాలు మనకు తెలసిందే. కానీ ఇప్పుడు మీరు చదవబోయేది వీటన్నింటికి చాలా విభిన్నమైన వార్త. ఓ వ్యక్తి ఎన్నికల్లో గెలవడం కోసం.. భార్యను మరోసారి వివాహం చేసుకున్నాడు. ఈ సంఘటన ఒడిశాలోని గంజాం జిల్లా కళ్లికోట సమితిలోని అయితపూర్ పంచాయతీలో చోటు చేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ప్రశాంత్ పొళాయి.. ఇదే సమితోలని శ్రీకృష్ణశరణపూర్ కు చెందిన ప్రభాతి సాహు అనే మహిళను కొన్నేళ్ల క్రితం న్యాయస్థానంలో వివాహం చేసుకున్నాడు.
ఈ క్రమంలో తాజాగా పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. ఈ స్థానం మహిళలకు కేటాయించారు. ఈ క్రమంలో ప్రశాంత్ తన భార్యను సర్పంచ్ గా నిలబెట్టాడు. కోర్టు సమక్షంలో వివాహం చేసుకున్నట్లు వివాహ పత్రాన్ని కూడా జతపర్చాడు. ఈ నేపథ్యంలో ఎవరైనా తమ వివాహం గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తారేమో.. కోర్టులో వివాహం చేసుకున్నాను అంటే నమ్మరేమో అని భావించిన ప్రశాంత్ ఎందుకైనా మంచిదని.. పంచాయతీలోని ఓ మందిరంలో గ్రామస్తుల సమక్షంలో తన భార్య ప్రభాతిని సంప్రదాయబద్దంగా మరోసారి వివాహం చేసుకున్నాడు.
తనను ఆశీర్వదించడానికి వచ్చిన వారందరిని.. ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించాడు. ఇది చూసిన జనాలు ఓట్ల కోసం ఇంత వరకు ఎవరు ఇలాంటి పని చేయలేదని.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.