వ్యవసాయం చేస్తుంటే పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదని రైతులు అనేక సందర్భాల్లో చెప్తూనే ఉంటారు. లాభాలు రాకపోయినా తినడానికి నాలుగు గింజలు పండించుకుందామన్న ఆశతో దాన్నే కొనసాగిస్తుంటారు. ఈ భాధలు కంటే.. తమ పొలంలో బంగారం బావో.. పెట్రోల్ బావో పడితే ఎంత బాగుంటుందో అని అనేక సందర్భాల్లో అనుకునే ఉంటారు. అలా ఈ రైతు అనుకున్నాడో లేదో.. కానీ, ఆయన పొలంలో మాత్రం పసిడి ఉందని ప్రచారం జరుగుతోంది.
వ్యవసాయం చేయాలంటే ఉండాల్సిన ప్రధానంగా ఉండాల్సింది.. నీరు. ఇది పుష్కలంగా ఉన్నప్పుడే రైతుకు వ్యవసాయం చేయాలన్న ఆసక్తి ఉంటుంది. మక్కువ కలుగుతుంది. మన కథనంలో రైతుకు నీటి అవసరం మరింత ఎక్కువైంది. వెంటనే తన పొలంలో బోరు తవ్వించాడు. పుష్కలంగా నీళ్లు పడ్డాయి. ఇంకేముంది పైపులు, మోటర్ లోనికి చొప్పించి నీళ్లు బయటకు లాగుదామనుకున్నాడు. ఆ ప్రయత్నమూ ఫలించింది. కాకుంటే.. లోపలి నుండి నీటితో పాటు బంగారం బయటకొచ్చింది. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది.
ఒడిశా, బొలంగీర్ జిల్లా బహాలి గ్రామానికి చెందిన మహ్మద్ జావెద్ తన పొలంలో సాగునీటి కోసం మార్చి 8న బోరు తవ్వించాడు. అందులో పుష్కలంగా నీళ్లు పడ్డాయి. వెంటనే నీటిని బయటకు లాగడం కోసం పైపులు, మోటర్ లోనికి చొప్పించాడు. దానికి విద్యుత్ సరఫరా కూడా అందించాడు. అన్ని సరిగ్గా అమర్చాక స్విచ్ ఆన్ చేయగా.. ఆ బోరు నుంచి బురద నీటితో పాటు బంగారం రంగులో ఉన్న పొడి కూడా పైకి వచ్చింది. చూడ్డానికి అచ్చం అది బంగారంలోనే ఉంది. ఇంకేముంది ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా ఊరంతా పాకిపోయింది. బోరు వేస్తే బంగారం పడిందంటూ పెద్దయెత్తున ప్రచారం సాగింది.
ఈ సమాచారం అందుకున్న స్థానిక తహసీల్దార్ ఆదిత్య మిశ్రాతో పాటు పలువురు అధికారులు శనివారం అక్కడకు చేరుకుని మట్టి నమూనా సేకరించి అనంతరం బోరును సీజ్ చేశారు. సేకరించిన మట్టి నమూనాను ల్యాబ్‌కు పంపించామని, పరీక్షలు జరిగాక ఇది బంగారమా లేదా వేరే ఖనిజమా అన్న విషయం ఖరారవుతుందని తహసీల్దార్ స్థానిక మీడియాకు తెలిపారు. మరోవైపు, ఇది బంగారమే అని గ్రామస్థులు సంబరపడిపోతున్నారు. ఒకవేళ అదే బంగారమే అయితే, దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా..? లేదా రైతుకే చెందుతుందా..? అన్నది తెలియాల్సి ఉంది. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియాల్సి ఉంది.