ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ప్రజల్లో ఆదరాభిమానాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే. వారు ఏం చేసినా కోట్లాది మంది ఫాలో అవుతుంటారు. అయితే అలాంటి ఒక రాష్ట్ర సీఎం తన తండ్రి సమాధిని తొలగించాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఎందుకిలా చేశారంటే..!
రోడ్డు విస్తరణతో పాటు ఇతర అభివృద్ధి పనుల కోసం ఇళ్లను తొలగించడాన్ని చూస్తూనే ఉన్నాం. ప్రజల బాగు కోసం ప్రభుత్వం చేసే ఈ పనులకు ఎవరూ అడ్డంకులు చెప్పరు. అయితే నష్టపరిహారం విషయంలో మాత్రం ఎక్కువగా ఇవ్వాలంటూ డిమాండ్లు చేస్తుంటారు. అభివృద్ధి పనుల కోసం ఇళ్లను తొలగించిన ఘటనల్లో దాదాపు అవన్నీ సాధారణ ప్రజలవే. ఇలాంటి ఘటనల్లో అధికారులు లేదా నాయకుల స్థలాలు పోవాల్సి వస్తే? ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తండ్రి సమాధినే తొలగించాల్సి వస్తే? ఎలా ఉంటుందో ఊహించుకోండి. అవును, ఒడిశాలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అభివృద్ధి పనుల కోసం ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ తండ్రి సమాధిని తొలగించాల్సి వచ్చింది. నవీన్ పట్నాయక్‌కు ప్రజల్లో చాలా మంచి పేరుంది.
అభివృద్ధి కోసం నవీన్ పట్నాయక్ ఎల్లప్పుడూ తపిస్తుంటారని అంటుంటారు. సింపుల్‌గా కనిపించే ఆయన.. సామాన్యుడిలా బతికేందుకు ఇష్టపడుతుంటారు. నవీన్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కూడా ఇంటి దగ్గర నుంచి పోలింగ్ బూత్ వరకు నడుచుకుంటూనే వెళ్తారు. సింపుల్ లైఫ్ స్టైల్, సేవ చేయాలనే తపన కోట్లాది మందికి ఆయన్ను దగ్గర చేసింది. అలాంటి నవీన్ పట్నాయక్ గతంలో పూరీలో డెవపల్‌మెంట్ పనుల కోసం తన తండ్రి బిజు పట్నాయక్ (బిజుబాబు) సమాధిని తొలగింపజేశారని రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పాటైన 5టి కార్యదర్శి వి.కార్తికేయ పాండ్యన్ తెలిపారు. దుబాయ్‌లో నిర్వహించిన ఒడిశా దివస్ వేడుకల్లో పాల్గొన్న పాండ్యన్ మాట్లాడుతూ.. ప్రజల మంచి కోసం నవీన్ పట్నాయక్ కఠిన నిర్ణయాలు తీసుకుంటారన్నారు. పూరీ మహా ప్రస్థానం ఆధునికీకరణ పనుల్లో భాగంగా కొన్నేళ్ల కింద బిజు పట్నాయక్ సమాధిని తొలగించిన విషయాన్ని ఈ సందర్భంగా పాండ్యన్ గుర్తు చేశారు.