కేరళలో వెలుగు జూసిన కొత్త వైరస్ నోరా కలనలం సృష్టిస్తుంది. ఇప్పటికే 13 మందికి సోకినట్టు వెల్లడించిన ప్రభుత్వం, వ్యాధిని అరికట్టే అంశాల మీద దృష్టిపెట్టింది. ఈ వ్యాధి ప్రధానంగా జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కలుషితమైన నీరు, ఆహారం ద్వారా సోకుతుంది. కరోనాతో ఇప్పటికే అతలాకుతలం అయిన కేరళలో ఇప్పుడు మరో కొత్త వైరస్ కనిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండు వారాల్లో వయినాడ్ జిల్లాలోని ఓ పశు వైద్యకళాశాలకు చెందిన 13 మంది విద్యార్థుల్లో నోరా వైరస్ బయటపడింది.
డయేరియా, వాంతులు ఈ వైరస్ లక్షణాలు అని చెప్పుకొచ్చిన ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. కాలేజీ బయట హాస్టళ్లలోని విద్యార్థుల్లో తొలిసారి ఈ వైరస్‌ను గుర్తించారు. దీనిపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి స్పందిస్తూ… నోరో వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ వైరస్ మరింత ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో దీని పట్ల విస్తృత స్థాయిలో చైతన్యం కలిగించాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి వనరులు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. సూపర్ క్లోరినేషన్ జరుగుతోందని తెలిపారు.
చిన్నారులు, వృద్ధులు, ఇతర వ్యాధులతో బాధపడేవారికి నోరో వైరస్ ముప్పుగా పరిణమిస్తుందని నిపుణులు తెలిపారు. జంతువుల ద్వారానే కాకుండా, ఈ వైరస్ సోకిన వ్యక్తుల ద్వారా కూడా ఇది మనుషులకు వ్యాపిస్తుంది. ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలని, జంతువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.