రోడ్డుపై వెళుతున్నపుడు ఎవరైనా లిఫ్ట్ అడిగితే ఇస్తూ ఉంటాం. అయితే, అలా లిఫ్ట్ ఇచ్చి సహాయం చేయటం కొన్ని సార్లు మనల్ని ఇబ్బందిలో పడేస్తుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే 2018లో ముంబైలో చోటుచేసుకున్న ఓ ఘటన. రాత్రి వేళ, వర్షంలో తడుస్తున్న వారికి లిఫ్ట్ ఇచ్చిన ఓ ఐటీ కంపెనీ ఓనర్‌కు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు. అతడ్ని కోర్టు మెట్లు ఎక్కించారు. ఈ అనుభవాన్ని సదరు ఐటీ కంపెనీ ఓనర్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. ఇతరులకు లిఫ్ట్ ఇచ్చి సహాయం చేయటం నేరమన్న సంగతి తనకు తెలియదంటూ వాపోయాడు.
ఇంతకీ ఏం జరిగింది..
2018, జూన్ 18న ముంబైకి చెందిన నితిన్ అనే ఐటీ కంపెనీ యజమానికి రోజూలాగే తన కారులో ఇంటికి బయలుదేరాడు. అప్పుడు జోరుగా వర్షం పడుతోంది. వాతావరణం మొత్తం చీకటిగా మారిపోయింది. కారు ముంబై ఐరోలి సర్కిల్ దగ్గరకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఓ ముగ్గురు వ్యక్తులు వర్షంలో తడుస్తూ రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు. నితిన్ కారు కనపడగానే లిఫ్ట్ కావాలని అడిగారు. ఆ ముగ్గురూ వర్షంలో తడుస్తూ ఉండటంతో ఆయన చలించి పోయాడు. ముగ్గురిని తన కారులో ఎక్కించుకున్నాడు. నితిన్ ఆ ముగ్గుర్ని కారులో ఎక్కించుకోవటం అక్కడికి కొద్దిదూరంలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు చూశారు. నితిన్ కారు వారి దగ్గరకు రాగానే ఆపారు. నితిన్‌ను బయటకు పిలిచారు. ఏంటి? ఎందుకు ఆపారు? అని తెలుసుకోవటానికి వారి దగ్గరకు వెళ్లాడు.
నితిన్ వారి దగ్గరకు రాగానే ఓ పోలీస్ అతడి చేతిలో 1500 రూపాయల ఛలానా పెట్టాడు. దీంతో నితిన్ షాక్ అయ్యాడు. ఛలానా ఏంటి అని ప్రశ్నించాడు. లిఫ్ట్ ఇచ్చినందుకని ఆ పోలీస్ చెప్పాడు. నితిన్ దాని గురించి ఇంకోసారి గట్టిగా అడిగేసరికి.. సెక్షన్ 66/192 రూల్ ప్రకారం అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వటం నేరం అని ఆ పోలీస్ చెప్పాడు. నితిన్ ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఆ పోలీస్ నితిన్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని, కోర్టులో ఛలానా కట్టి దాన్ని తీసుకోమని చెప్పాడు. చేసేదేమీ లేక నితిన్ కోర్టులో ఛలానా కట్టి లైసెన్స్ తెచ్చుకున్నాడు. తన అనుభవాన్ని ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ప్రపంచంతో పంచుకున్నాడు. దీన్ని ఓ న్యాయవాదిలో తెలుగులో షేర్ చేశారు. అయితే, దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు లిఫ్ట్ ఇవ్వటం నేరామా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.
నిజంగా ఇతరులకు లిఫ్ట్ ఇవ్వటం నేరమా.. చట్టంలో ఏముంది?
నిజానికి ఎవరికీ లిప్ట్ ఇవ్వకూడదని ఎక్కడా లేదు. అయితే, వ్యక్తిగత వాహనాలను కమర్షియల్ కోసం వాడటం మాత్రం నేరం. సొంత వాహనాలను కిరాయికి తిప్పి డబ్బులు సంపాదించకూడదు. నితిన్ విషయంలో ట్రాఫిక్ పోలీసులు పొరపాటుపడ్డారు. ఆ ముగ్గుర్ని ఎక్కించుకోవటంతో.. అతడు తన వాహనాన్ని కిరాయికి తిప్పుతున్నాడని భావించారు. అందుకే అతడికి ఛలానా వేశారు. చట్టం గురించి నితిన్‌కు సరిగా తెలియకపోవటంతో ఇదంతా జరిగింది.