కరోనా ప్రపంచాన్ని భయపెట్టిన మహామ్మారి. ఏ నిమిషాన ఈ వైరస్ వ్యాప్తి మొదలయ్యిందో తెలియదు కానీ.. నేటికి కూడా అనేక దేశాలు ఇంకా దీని కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోయింది. మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ వల్ల దేశాల ఆర్థిక వ్యవస్థలు అతాలకుతలం అయ్యాయి. ఎందరో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. లాక్‌డౌన్ కారణంగా పలు సంస్థలు మూత పడ్డాయి. పొట్ట చేత పట్టుకుని స్వగ్రామం బాట పట్టారు చాలా మంది. అయితే లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత నెమ్మదిగా అందరూ పట్టణాలకు తిరిగి రావడం మొదలు పెట్టారు. కానీ లాక్‌డౌన్ నష్టాలను పూడ్చుకునేందుకు చాలా కంపెనీలు.. వీలనైంత మేర ఉద్యోగులను తొలగించాయి. కొత్తగా ఉద్యోగులను తీసుకోలేదు. ఇవే పరిస్థితులు ఇలానే కొనసాగితే.. ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయేవి. అప్పుల భారం తట్టుకోలేక ఎందరు ప్రాణాలు తీసుకునేవారో అంచనా వేయడం కష్టం. కానీ ఇలాంటి సమయంలో.. ఎన్నో కుటుంబాలను ఆదుకుంది గిగ్ వర్క్. పార్ట్ టైం, ఫుల్ టైం ఉపాధి కల్పిస్తూ.. ఎందరోని ఆదుకుంటుంది గిగ్ వర్క్. అసలింతకు ఏంటి గిగ్ వర్క్..
కరోనా తర్వాత భారతదేశ ఆర్థిక పరిస్థితి కూడా కుంటుపడింది. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి.. రోడ్డున పడ్డారు. దేశంలో నిరుద్యోగిత పెరిగింది. ఇలాంటి సమయంలో ఎందరినో ఆదుకుంది గిగ్ వర్క్. మన భాషలో చెప్పాలంటే.. డెలివరీ ఏజెంట్ జాబ్. ఆర్థిక అవసరాల నిమిత్తం.. రోజులో కొన్ని గంటలు.. లేదా కొన్ని రోజుల పాటు.. స్విగ్గీ, ర్యాపిడో, వోలా, జొమాటో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, డంజో, బఫుడ్ పాండా, ఉబర్ ఈట్స్ వంటి వాటిల్లో పని చేస్తూ.. ఉపాధి పొందడాన్ని గిగ్ వర్క్ అంటారు. ఈ తరహా ఆర్థిక వ్యవస్థని గిగ్ ఎకానమీ అంటారు. దీనిలో పని చేసేవారిని గిగ్ వర్కర్స్ అంటారు.
తమకు వీలున్నప్పుడు పని చేస్తూ.. తాత్కాలిక ఆదాయం సంపాదిస్తున్న గిగ్ వర్కర్స్ సంఖ్య మనదగ్గర రోజు రోజుకు పెరిగిపోతుంది. 2020-20 నాటికి వీరి సంఖ్య 75 లక్షలు ఉన్నట్లు నీతి అయోగ్ జూన్ 2020లో విడుదల చేసిన ఇండియాస్ బూమింగ్ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం ఎకానమీ అనే రిపోర్టులో తెలిపింది. ఎప్పుడైనా, ఎక్కడ నుంచైనా పని చేసుకునే అవకాశం ఉండటంతో.. దేశంలో గిక్ వర్కర్స్ అన్ని రంగాల్లో పెరుగుతుండటంతో.. గిగ్ ఎకానమీ విస్తరిస్తోందని నీతి అయోగ్ తెలిపింది. అయితే ప్రస్తుతానికి మెట్రో, ప్రధాన నగరాల్లో మాత్రమే గిగ్ వర్క్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది.
‘‘దేశంలో ప్రస్తుతం ఉన్న వర్క్ ఫోర్స్‌లో గిగ్ వర్కర్లు 1.5 శాతం మంది ఉన్నారు. ఇది వర్కర్లకు, సంస్థలకు, వినియోగదారులకు అందరికి ఉపయోగకరంగా ఉంది. అయితే గిగ్ వర్కర్స్‌కి తక్కువ వేతనాలు, వర్కర్స్‌కి చట్టాలు, సదుపాయాలు పెద్దగా లేకపోవడం వంటి సమస్యలున్నాయి. వీటిపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది” అని నీతి ఆయోగ్ నివేదిక సూచించింది. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో చేసిన సర్వే ప్రకారం గిగ్ వర్కర్లలో మహిళలు 16 నుంచి 23 శాతం వరకు ఉన్నారని, వీరిలో ఎక్కువ మంది చదువు పూర్తైన వెంటనే.. లేదా పెళ్లైన తర్వాత గిగ్ వర్కర్లుగా మారారని నీతి ఆయోగ్ వెల్లడించింది. అంతేకాక ఈ నివేదిక అంచనాల ప్రకారం2029-30 నాటికి గిగ్ ఎకానమీ వర్కర్లు 2 కోట్ల 35 లక్షల మంది ఉంటారని… అంటే అది దేశంలోని వర్క్ ఫోర్స్ లో 4.1 శాతంగా ఉండనుందని పేర్కొంది.