భారతదేశానికి గాయం చేసిన సంఘటనల్లో 1993 ముంబాయి పేలుళ్లు ఒకటి. మారణ హోమం సృష్టించిన ఈ దారుణ సంఘటనకు సంబంధించిన సూత్రధారి అయిన దావుద్ ఇబ్రహీంను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఈ క్రమంలో దావుద్ పై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)భారీ రివార్డును ప్రకటించింది. ఈమేరకు గురువారం అధికారులు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం.. మాఫియా ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అంతలా అతడు మాఫియాను విస్తరించాడు. అయితే అతడు పాకిస్తాన్ కేంద్రంగా తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు 2018లోనే ఐక్యరాజ్య సమితి తెలిపింది. అదీ కాక దావుద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా కూడా పేర్కొంది. తాజాగా అంతర్జాతీయ ఉగ్ర సంస్థ అయిన డీ కంపెనీ పై ఎన్ఐఏ గతేడాదిలో కేసు నమోదు చేసింది.
ఈ కంపెనీ గన్స్ స్మగ్లింగ్, మనీ లాండరింగ్, క్రిమినల్ సిండికేట్ లాంటి పలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలోనే దర్యాప్తు సంస్థ కఠిన నిర్ణయాలను తీసుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగానే 1993 ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి దావుద్ తల పై రివార్డు ను ప్రకటించింది. అతడి గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.25 లక్షలు ఇస్తామని తెలిపింది.
ఇక అతడి అనుచరులు అయిన చోటా షకీల్ పై రూ.20 లక్షలు ప్రకటించగా.. టైగర్ మెమన్, చిక్నా,హజి అనీస్ లపై రూ.15 లక్షల రివార్డును ప్రకటించింది. వీరి అరెస్ట్ కు వీలుగా ఏ సమాచారాన్ని ఇచ్చినా గాని వారికి ఈ బహుమతి లభిస్తుందని సంస్థ పేర్కొంది. అయితే దావుద్ పాక్ లోన కరాచీలో ఆశ్రయం పొందుతున్నట్లు పలు నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. మరి ఈ క్రమంలో భారత దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఐఏ రివార్డు ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.