మన దేశంలో ప్రధాన రవాణా మార్గాలు అంటే రోడ్డు, రైలు మార్గాలే. సామాన్యుడి నుంచి ధనవంతుల వరకు అత్యధికంగా ఉపయోగించేది రోడ్డు, రైలు మాత్రమే. ఆ తర్వాత ఆకాశ మార్గంలో ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. అయితే ముంబైలో మాత్రం ఇంకో రవాణా మార్గం అందుబాటులోకి రానుంది. అదికూడా వచ్చే జనవరి నుంచే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. న్యూ ముంబై నుంచి దక్షిణ ముంబై మధ్య వాటర్ ట్యాక్సీ సర్వీసులను అతి త్వరలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ఈ జలమార్గం ద్వారా ప్రయాణికులకు దాదాపు 30 కిలోమీటర్ల దూరం తగ్గడమే కాకుండా.. మంచి ప్రయాణ అనుభూతిని పొందుతారంటున్నారు. రోడ్డు, రైలు మార్గాలకు ప్రత్యమ్నాయంగా ఈ వాటర్ ట్యాక్సీలను పరిచయం చేస్తున్నట్లు చెబుతున్నారు. చాలా రోజుల నుంచే ఈ ప్రతిపాదన ఉండగా ఇప్పుడు అమలులోకి రానుంది. రానున్న రోజుల్లో ముంబైలో ఇదే ప్రధాన రవాణా మార్గంగా మారే అవకాశం కూడా ఉందంటూ చెబుతున్నారు.
రూట్స్ ను కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆమోదించినట్లు తెలుస్తోంది. డొమెస్టిక్ క్రూయిస్ టెర్మినల్ నుంచి జవహర్ లాల్ నెహ్రూ పోర్టు మధ్య అత్యంత రద్దీ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు ఆపరేటర్లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మరో ఆపరేటర్ ఇంకో రెండు నెలల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. డొమెస్టిక్ క్రూయిస్ నుంచి న్యూముంబైకి టికెట్ ధర రూ.1200 నుంచి రూ.1500 వరకు ఉండే అవకాశం ఉంది. డొమెస్టిక్ క్రూయిస్ నుంచి జవహర్ లాల్ నెహ్రూ పోర్టుకు రూ.750 ఉండచ్చని తెలుస్తోంది. వాటర్ ట్యాక్సీ సర్వీసులు ముంబయిలో కచ్చితంగా అవసరమే అంటారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.