కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రమాదంలో దాదాపు 240 మంది చనిపోగా.. 900లకుపైగా మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఒడిశాలో చోటుచేసుకున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతోంది. ఇప్పటివరకు 240 మంది దాకా చనిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు 900ల మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఇక, ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి గంట,గంటకు ఓ కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. వెలుగులోకి వచ్చిన తాజా సమాచారం ప్రకారం మొత్తం 4 రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఇప్పటి వరకు మూడు రైళ్లు మాత్రమే ప్రమాదానికి గురయ్యాయని అందరూ భావిస్తున్నారు. అంతేకాదు! అసలు ఈ ప్రమాదానికి కారణం కోరమాండల్ కాదని, యశ్వంత్‌పూర్ అని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కీలక పాత్ర యశ్వంత్‌పూర్ ట్రైన్‌దేనని సమాచారం.
శుక్రవారం సాయంత్రం యశ్వంత్‌పూర్ ఎక్సప్రెస్ బెంగళూరునుంచి పశ్చిమ బెంగాల్‌లోని హౌరాకు వెళుతోంది. 6.50 – 7 గంటల సమయంలో బాలేశ్వర్ దగ్గర పట్టాలు తప్పింది. దీంతో కొన్ని బోగీలు పట్టాలపై పడిపోయాయి. పడిపోయిన బోగీలను 128 కిలోమీటర్ల వేగంతో వస్తున్న కొరమాండల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఢీకొట్టింది. దీంతో కోరమాండ్ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించిన 15 భోగీలు బోల్తాపడ్డాయి. ఈ బోల్తా పడ్డ భోగీలను పక్క ట్రాక్‌పై వెళుతున్న గూడ్సు రైలు ఢీకొట్టింది. దీంతో ప్రమాద తీవ్రత స్థాయి బాగా పెరిగిపోయింది.
కాగా, ఈ ప్రమాదంపై అన్ని వర్గాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఈ ఘటనపై తమ సంతాపం వ్యక్తం చేశారు. చిరంజీవి తన ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ఒడిశా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. గాయపడిన వారి చికిత్స కోసం భారీగా రక్తం అవసరం అవుతుందని.. ఘటనాస్థలికి దగ్గర్లో ఉన్న తన ఫ్యాన్స్ వెంటనే వెళ్లి రక్తదానం చేయాలని కోరారు. మరి, ఈ ఘోర ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.