పాఠ్యపుస్తకాల్లో చరిత్రకు సంబంధించిన వ్యక్తులు, ఘటనలకు సంబందించిన పాఠాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా మారిన విద్యా విధానం కారణంగా పాఠ్య ప్రణాళిక విషయంలో మార్పులు చోటు చేసుకున్నాయి. అప్రస్తుతం, అవసరం లేనివని చెబుతూ చరిత్రలో కొన్ని పాఠాలను తొలగిస్తున్నారు. మహాత్మా గాంధీకి సంబంధించిన పాఠ్యాంశాలను పాఠ్యపుస్తకాల నుంచి తొలగించారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 11, 12 తరగతుల రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్రం పాఠ్యపుస్తకాల నుంచి కొన్ని పాఠ్యపుస్తకాలను ఎన్సీఈఆర్టీ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) తొలగించింది. తొలగించిన పాఠాల్లో మహాత్మా గాంధీ హత్య, ఆర్ఎస్ఎస్ నిషేధం, హిందూ-ముస్లిం ఐక్యతకు సంబంధించిన పాఠాలు ఉన్నాయి. అయితే గత ఏడాది ఎన్సీఈఆర్టీ సిలబస్ హేతుబద్దీకరణలో భాగంగా కొన్ని పాఠాలను తొలగించారు. గాంధీ హత్య దేశంలో మతపరమైన పరిస్థితులపై ప్రభావం చూపడం, హిందూ-ముస్లిం ఐక్యత కోసం గాంధీ అనుసరించిన చర్య హిందూ అతివాదులను రెచ్చగొట్టడం, కొన్నాళ్ళు ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు నిషేధించబడటం వంటివి పాఠాల్లో ఉన్నాయని వాటిని తొలగించడం జరిగింది.
అయితే ఈ పాఠాలను ఇప్పుడు తొలగించలేదని.. గత ఏడాది జూన్ లోనే తొలగించినట్లు ఎన్సీఈఆర్టీ వెల్లడించింది. ఈ ఏడాది పాఠ్య ప్రణాళికలో ఎటువంటి మార్పులు చేయలేదని పేర్కొంది. పాఠ్య ప్రణాళిక హేతుబద్దీకరణలో భాగంగా గత ఏడాది గుజరాత్ అల్లర్లు, మొఘల్ కోర్టులు, ఎమర్జన్సీ, ప్రచ్ఛన్న యుద్ధం, నక్సల్ ఉద్యమం సహా ఇతర పాఠ్యాంశాల్లో అప్రస్తుతంగా ఉన్న అంశాలను తొలగించింది. అతివ్యాప్తి, అప్రస్తుతం అని చెప్పి ఆ పాఠాలను తొలగించినట్లు ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేష్ సల్కనీ వెల్లడించారు. కోవిడ్-19 పరిస్థితులు, కొత్త విద్యా విధానంలో భాగంగా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు అన్ని తరగతుల పథ పుస్తకాల్లో పాఠ్యాంశాల హేతుబద్దీకరణ చేపట్టినట్లు ఎన్సీఈఆర్టీ వెబ్ సైట్ లో పేర్కొన్నారు.
అయితే సిలబస్ నుంచి పాఠ్యాంశాల తొలగించడంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీకార ధోరణితో చరిత్రను చెరిపివేసే ప్రయత్నం చేస్తున్నారని.. బీజేపీ-ఆర్ఎస్ఎస్ లు ఇందుకు బాధ్యులని.. చరిత్రను కనుమరుగు చేయడం ఎవరి తరం కాదని అన్నారు. అయితే దీనిపై బీజేపీ కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే స్పందించారు. భారత దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అతిగొప్ప వక్రీకరణలు చేసిందని.. తాము ఆ తప్పులను సరిచేస్తున్నామని అన్నారు. ఇక మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బావన్ కులే మాట్లాడుతూ.. ‘చరిత్రను కొంతమంది తప్పుదోవ పట్టించారని.. అలాంటి తప్పుడు సమాచారాన్ని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మరి పాఠ్యపుస్తకాల నుంచి ఎన్సీఈఆర్టీ గాంధీ హత్య, గుజరాత్ అల్లర్లు వంటి అంశాలను తొలగించడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.