సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. ఎన్నో ఆశలతో బాలీవుడ్ లో అడుగుపెట్టి హీరోగా నిలదొక్కుకున్నాడు. స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేసుకునే సమయానికి 2020 కరోనా సమయంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. సుశాంత్ సింగ్ ది హత్యా? ఆత్మహత్యా? అనేది ఇంకా తేలలేదు. ఆత్మహత్యగా కేసును క్లోజ్ చేసే సమయంలో సీబీఐ కేసును టేకోవర్ చేసుకుంది. ఆ తర్వాత మాదకద్రవ్యాల పాత్ర కూడా ఉందని తెలుసుకుని ఎన్సీబీ కూడా విచారణ ప్రారంభించింది.
అయితే తాజాగా సుశాంత్ సింగ్ మృతి కేసులో రియా చక్రవర్తి సహా మరో 34 మందిపై ఎన్సీబీ అధికారులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. రియా చక్రవర్తి చిన్న మొత్తంలో గంజాయి కొనుగోలు చేసిందని, పలుసార్లు గంజాయి కోసం డబ్బు చెల్లించిందని ఎన్సీబీ అధికారులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. అనుమానితుల్లో రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తిని కూడా చేర్చారు.
ఎన్సీబీ అధికారులు ఏం చెప్పారంటే.. రియా చక్రవర్తి పలుసార్లు గంజాయి కొనుగోలు చేసిందన్నారు. వాటికోసం డబ్బు కూడా చెల్లించడమే కాకుండా ఆవిడే సుశాంత్ సింగ్ కు గంజాయి అందజేసినట్లు తెలిపారు. ఎన్సీబీ అధికారులు చేసిన అభియోగాలు రుజువైతే రియా చక్రవర్తికి దాదాపు పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా.. రియా చక్రవర్తిపై వస్తున్న ఆరోపణలను ఆమె ఖండించింది.
“నేను ఎలాంటి తప్పు చేయలేదు. విచారణ జరిగి తీర్పు వెలువడే దాకా ఓపిక పట్టండి, న్యాయవ్యవస్థ మీద కాస్త నమ్మకం ఉంచండి. నా కుటుంబాన్ని ఇప్పటికైనా వదిలేస్తారా? నా తండ్రి 25 ఏళ్లు ఆర్మీలో ఈ దేశం కోసం పాటు పడ్డారు. నేను కేసుకు సంబంధించి ప్రతి విచారణకు సహకరిస్తన్నాను. నేను ఎక్కడికీ పారిపోను. నా తల్లి ఈ వార్తలు చూసి మానసికంగా కృంగి పోతోంది. నా తండ్రి ఎంతగానో ఆవేదన చెందుతున్నారు. నేను ఇప్పటికీ బతికే ఉన్నాను అంటే.. నేను నిజమే చెబుతున్నాను కాబట్టే. నేను నా జీవితంలో ఎలాంటి డ్రగ్ డీలర్ తో మాట్లాడలేదు. నా జీవితంలో నేను ఎలాంటి మాదకద్రవ్యాలు తీసుకోలేదు. నేను బ్లడ్ టెస్టు చేయించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను” అని రియా స్పందించింది.
ఈ సందర్భంగా సుశాంత్ సింగ్ గంజాయి తాగేవాడని రియా చక్రవర్తి లైవ్ లో అంగీకరించింది. సుశాంత్ సింగ్ ని గంజాయి తాగకుండా ఆపేందుకు తాను ఎంతో కష్టపడినట్లు తెలిపింది. ఇక సుశాంత్ సింగ్ మృతి కేసుకు సంబంధించి 2020 సెప్టెంబర్ నెలలో రియా చక్రవర్తి అరెస్టు అయ్యింది. నెల రోజుల తర్వాత బాంబే కోర్టు రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు చేసింది. ఎన్సీబీ రియా చక్రవర్తిపై ఛార్జ్ షీట్ నమోదు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.