ఈ దేశం కోసం సుభాష్ చంద్రబోస్ చేసిన త్యాగాలను వెలుగులోకి రాకుండా కుట్ర చేశారని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయ స్మారకాన్ని అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో నేతాజీ జాతీయ స్మారకం నమూనాను మోదీ ఆవిష్కరించారు. సోమవారం నేతాజీ 126వ జయంతి సందర్భంగా ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేతాజీ స్మారక చిహ్నం నమూనాను ఆవిష్కరించిన మోదీ భావోద్వేగానికి గురయ్యారు. నేతాజీ స్మారక చిహ్నం దేశ ప్రజల హృదయాల్లో దేశభక్తి భావాలను నింపుతుందని అన్నారు. దేశం మొత్తం నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు నివాళులు అర్పిస్తోందని, నేతాజీ వారసత్వాన్ని కాపాడుతోందని అన్నారు.
స్వాతంత్య్ర పోరాట చరిత్రను తెలుసుకోవడానికి ప్రజలు అండమాన్ ను సందర్శిస్తున్నారని, దేశంలో తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన నేల అండమాన్ నికోబార్ దీవులు అని మోదీ గుర్తు చేశారు. 1943లో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా నేతాజీ అండమాన్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని గుర్తు చేశారు. నేతాజీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అండమాన్ నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం ఆనందంగా ఉందని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్ తో పాటు అనేకమంది దేశ భక్తులు అండమాన్ జైల్లోనే శిక్ష అనుభవించారని మోదీ పేర్కొన్నారు. దేశం మొత్తం నేతాజీ జన్మదినాన్ని పరాక్రమ దివస్ గా జరుపుకుంటోందని, ఈ దీవులకు 21 మంది పరమవీరచక్ర గ్రహీతల పేర్లను పెట్టడం ఎప్పటికీ అజరామరంగా నిలిచిపోతుందని అన్నారు.
స్వాతంత్య్ర పోరాటంలో నేతాజీ చేసిన కృషిని వెలుగులోకి రాకుండా కొందరు కుట్ర చేశారని, కానీ నేడు దేశం మొత్తం నేతాజీని స్మరించుకుంటుందని మోదీ తెలిపారు. నేతాజీ రహస్య పత్రాలను బహిరంగ పరచాలన్న డిమాండ్ కు అనుగుణంగా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మోదీ వెల్లడించారు. 1897 జనవరి 23న కోల్కతాలో జన్మించిన నేతాజీ.. స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారు. ఆజాద్ హిందూ ఫౌజ్ సంస్థను స్థాపించి.. బ్రిటీషర్ల వెన్నుల్లో వణుకు పుట్టించారు. 1945 ఆగస్ట్ 18న విమాన ప్రమాదంలో మరణించారు. నేతాజీ చేసిన త్యాగం ఈ దేశం మరువరానిది. మొదటిసారిగా బ్రిటీషర్లకు వ్యతిరేకంగా అండమాన్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన నేతాజీ స్మారక చిహ్నాన్ని.. అదే అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్మిస్తున్న భారత ప్రభుత్వంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.