భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం నేడు (సెప్టెంబర్ 17). ఇవాళ్టితో ఆయన 72వ వసంతంలోకి అడుగుపెట్టారు. మోదీ పుట్టిన రోజు నేపథ్యంలో బీజేపీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి ఏటా మోదీ పుట్టిన రోజున ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు మోదీ ఆరోగ్యం కోసం పూజలు, హోమాలు, భారీ ఎత్తున కేక్‌లు కట్ చేయడం లాంటివి చేస్తుంటారు. అయితే అందుకు భిన్నంగా ఈ సారి బర్త్‌డే సెలబ్రేషన్స్ చేయనున్నారు. దేశవ్యాప్తంగా మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఓ రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం మోదీ బర్త్‌డే సందర్భంగా బంపరాఫర్ ప్రకటించారు. తమ అభిమాన నేత అయిన మోదీ పుట్టిన రోజు సెప్టెంబరు 17న జన్మించే పిల్లలకు బంగారు ఉంగరాలను కానుకగా ఇవ్వాలని నిర్ణయించారు. వాటితో పాటు బేబీ కిట్‌లను కూడా వారికి అందజేయనున్నారు.
మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఈ బంపరాఫర్ ప్రకటించింది.. తమిళనాడు రాష్ట్ర బీజేపీ నేతలు. నరేంద్ర మోదీ జన్మదినమైన సెప్టెంబరు 17న పుట్టిన పిల్లలకు బంగారు ఉంగరాలను అందజేయనున్నారు తమిళనాడు బీజేపీ నేతలు. ఈ రోజు జన్మించే పిల్లలకు రూ.5 వేలు ఖరీదుచేసే 2 గ్రాముల బంగారు ఉంగరంతో పాటు బేబీ కిట్‌లు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో చెన్నై రొయాపురంలోని ఆర్ఎస్ఆర్ఎం ఆస్పత్రిలో లబ్దిదారులకు బంగార ఉంగరంతో పాటు బేబీ కిట్‌లను కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ అందజేస్తారు.
అలానే నేడు ప్రధాని నరేంద్ర మోదీకి కామన్వెల్త్ క్రీడాకారులు అందించిన సుమారు 1200 రకాలు బహుమతులను వేలం వేయనున్నారు. ఈ ఆక్షన్ ద్వారా వచ్చిన డబ్బులను నమామి గంగే ప్రాజెక్టు కోసం నరేంద్ర మోదీ విరాళంగా అందజేయనున్నారు. మోదీకి బహుమతిగా వచ్చిన వాటిలో వినాయకుడి విగ్రహాలు, అయోధ్య నమూనా ఆలయం, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం నమూనాలు కూడా ఉన్నాయని.. వాటిని కూడా వేలం వేస్తున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.