మతం అంటే ఒక జీవన విధానం. దేవుడ్ని భక్తి మార్గంలో చేరుకునే ఒక గమ్యం. ఎవరెలా బతికినా అంతిమంగా మాట్లాడేది దేవుడి గురించే. ఒకరి మత విశ్వాసాలను ఒకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఎలాంటి సమస్య ఉండదు. ‘మన మతాన్ని ప్రేమిద్దాం, పర మతాన్ని గౌరవిద్దాం’ అనే నినాదంతో చాలా మంది వివిధ మతస్తులు ఇతర మతస్తులతో తోబుట్టువుల్లా జీవిస్తున్నారు. అందుకే ఈ దేశం ప్రపంచ దేశాల సిద్ధాంతాల కంటే గొప్ప సిద్ధాంతం అయిన భిన్నత్వంలో ఏకత్వంగా నిలిచింది. చరిత్ర చూసుకుంటే హిందూ ఆలయాలు కట్టిన ఇతర మతస్తులు ఉన్నారు, మసీదులని గౌరవించిన హిందూ చక్రవర్తులూ ఉన్నారు. ఇప్పటికీ మసీదులకు, చర్చిలకు వెళ్లే హిందువులు, హిందూ ఆలయాలను దర్శించే ముస్లింలు, క్రైస్తవులు ఉన్నారు.
— Indian Social Media (@NagarjunaWriter) October 29, 2022
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఘటన ఒకటి కాశీలో చోటు చేసుకుంది. నూర్ ఫాతిమా అనే ఒక ముస్లిం శివాలయాన్ని నిర్మించారు. అక్కడితో ఆగకుండా భక్తుల సౌకర్యం కోసం ఒక పెద్ద హాలు కూడా నిర్మించారు. వారణాసిలోని రుద్ర బీహార్ కాలనీలో నివసించే నూర్ ఫాతిమా లాయర్ గా పని చేస్తున్నారు. 2004లోనే ఆమె కాశీలో శివాలయాన్ని నిర్మించారు. అయితే ఆలయంలో పూజలు చేసుకునేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారని.. ఆలయానికి ఎదురుగా పెద్ద హాలుని ఏర్పాటు చేశారు.
ఇదంతా ఎందుకు చేస్తున్నారని అడిగితే.. తనకు కలలో శివుడు కనిపించి.. ఆలయాన్ని నిర్మించమని చెప్పారని ఆమె జవాబిచ్చారు. అందుకే ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే శివాలయాన్ని నిర్మాణానికి పూనుకున్నానని, ఇప్పుడు హాలు కూడా అలానే నిర్మించానని ఆమె వెల్లడించారు. ఆమె చేసిన పనికి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీలాంటి వారు ఉండబట్టే ఈ దేశం ఇంకా పచ్చగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.