మన దగ్గర ఆలయాల్లో బ్రాహ్మణులు మరీ ముఖ్యంగా హిందువులు మాత్రమే పూజారులుగా వ్యవహరిస్తారు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ఆలయంలో మాత్రం ముస్లిం వ్యక్తి పూజారిగా ఉంటున్నాడు. అది కూడా వందల ఏళ్లుగా.. మరి ఆ ఆలయం ఎక్కడుంది అంటే..
భారతదేశం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది.. భిన్నత్వంలో ఏకత్వం.. లౌకిక దేశం. అవును మరి ప్రపంచంలో చాలా దేశాల్లో ఒకే మతం, వర్గం, జాతికి చెందిన వారు మాత్రమే ఉంటారు. కానీ మన దేశంలో మాత్రం.. అనేక మతాలు, వర్గాలు, జాతుల ప్రజలు కలిసి మెలసి జీవిస్తున్నారు. హిందూముస్లింలు అన్నదమ్ముల మాదిరి కలిసి ఉంటారు. మతంతో సంబంధం లేకుండా ఒకరి ఇళ్లలో జరిగే పండగలు, కార్యక్రమాలు, వేడుకులకు ఇంకొక వర్గం, మతం వారు హాజరవుతుంటారు. ఇక కొన్ని చోట్ల మరింత భిన్నమైన అరుదైన దృశ్యాలు కనిపిస్తాయి. సాధారణంగా మన దేశంలో చాలా వరకు ఆలయాల్లో పూజలు అంటే.. హిందువులు.. అందునా బ్రాహ్మణులే ఎక్కువగా ఉంటారు. ఎక్కడో ఓ చోట మాత్రం.. ఆ గుడి చరిత్ర, ఆలయ విశిష్టతను బట్టి.. వేరే సామాజిక వర్గాల వారు పూజలు నిర్వహిస్తారు. సరే సామాజిక వర్గం సంగతి పక్కకు పెడితే.. మన దగ్గర ఆలయాల్లో పూజలు చేసే వారు హిందువులే అయి ఉంటారు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ఆలయం మాత్రం చాలా ప్రత్యేకం. ఇక్కడ పూజారి ఓ ముస్లిం. ఆ వివరాలు..
ఈ అరుదైన సంఘటన రాజస్థాన్‌లో కనిపిస్తుంది. ఇక్కడ ఓ గ్రామంలో మారుమూల కొండపై ఉన్న 600 ఏళ్ల నాటి దుర్గామాత ఆలయం చాలా ప్రత్యేకత, విశిష్టత కలిగింది. ఈ ఆలయంలో ముస్లిం వ్యక్తి పూజారిగా అమ్మవారికి పూజలు చేస్తున్నాడు. జోధ్‌పూర్ జిల్లాలోని అటవీ ప్రాంతమైన భోపాల్‌ఘర్ ఏరియాలో బగోరియా అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోని ఎత్తైన కొండలపై చాలా పురాతనమైన దుర్గా దేవి ఆలయం ఉంది. ఈ ఆలయంలోకి వెళ్లడానికి భక్తులు ఏకంగా 500 మెట్లు , 11 విజయ్ పోల్స్ దాటితే.. అప్పుడు ఆలయం దగ్గరకు చేరుకుని దుర్గా దేవిని దర్శనం చేసుకోవచ్చు. ఆలయానికి చేరడం ఇంత కష్టమైనా సరే.. రోజు వేలాది మంది భక్తుల తరలి వచ్చి దుర్గాదేవిని దర్శించుకుంటారు. అయితే.. ఈ ఆలయంలో తరతరాలుగా ముస్లింలు పూజారులుగా వ్యవహరిస్తూ.. దుర్గా దేవికి పూజలు చేస్తున్నారు.
ఈ దుర్గాదేవి ఆలయంలో ప్రస్తుతం జలాలుద్దీన్ ఖాన్ అనే ముస్లిం వ్యక్తి పూజారిగా ఉన్నాడు. వీళ్లు కేవలం పూజలు చేయడం మాత్రమే కాక.. దేవి నవరాత్రుల్లో ఉపవాస దీక్షలు చేస్తూ.. అమ్మవారిని పూజిస్తారు. ఇక గత కొన్ని తరాలుగా.. ఈ కుటుంబానికి చెందిన వారే పూజరులుగా ఉంటున్నారు. నవరాత్రుల సమయంలో ప్రధాన పూజారి ఆలయ ప్రాంగణంలోనే ఉంటూ.. ఉపవాస దీక్షలు, భజనలు చేస్తూ.. ఎంతో భక్తితో అమ్మవారిని పూజిస్తారు. ఈ ఆలయంలో ముస్లిం వ్యక్తులు పూజారులుగా వ్యవహరించడం వెనక ఒక పురాతన కథ ప్రచారంలో ఉంది.
పురాణాల ప్రకారం.. కొన్ని వందల సంవత్సరాల క్రితం సింధ్ ప్రావిన్స్‌లో తీవ్రమైన కరువు వచ్చింది. ప్రస్తుతం ఆలయంలో పూజారిగా ఉన్న జలాలుద్దీన్ ఖాన్ పూర్వీకులు మరో ప్రాంతానికి వలస వెళ్లాలని భావించారు. ఈ క్రమంలో అతని పూర్వీకులు ఒంటెల కాన్వాయ్‌తో మాల్వాకు చేరుకున్నారు. అయితే.. దారిలో కొన్ని ఒంటెలు అస్వస్థతకు గురయ్యాయి. ఇలా ఉండగా వారిలో ఒకరికి అమ్మవారు కలలో కనిపించి.. సమీపంలోని మెట్ల బావిలో ఉన్న దేవి విగ్రహాన్ని బయటకు తీసి.. అందులోని నీటిని ఒంటెలకు తాగిస్తే.. వాటి రోగం తగుతుందని చెప్పిందట.
వాళ్లు నిద్ర నుంచి మెలుకుని లేచి చూసి.. కలలో అమ్మవారు చెప్పినట్లుగానే మెట్లబావి దగ్గరకు వెళ్లి.. దానిలో నుంచి దుర్గా దేవి విగ్రహాన్ని బయటకు తీశారు. ఆ తర్వాత ఆ తల్లి చెప్పినట్లే.. బావిలోని నీటిని ఒంటెలకు తాగించారు. ఆశ్చర్యంగా వాటి రోగం పూర్తిగా నయమయ్యి.. ఆరోగ్యంగా మారాయి. ఈ అద్భుతానికి ప్రత్యక్ష సాక్షులైన జలాలుద్దీన్‌ఖాన్ పూర్వీకులు ఈ గ్రామంలోనే ఉండాలని నిర్ణయించుకుంది. అలా జలాలుద్దీన్‌ఖాన్ పూర్వీకులు ఇక్కడే స్థిరపడిపోయారు. అప్పటి నుంచి వారు దుర్గాదేవిని పూజించడం ప్రారంభించారు.
జలాలుద్దీన్ ఖాన్ కుటుంబ సభ్యులు తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ రోజు వరకు కూడా ఈ ఆలయంలో ముస్లింలే పూజారులుగా ఉంటూ వస్తున్నారు. దుర్గా దేవిని సేవిస్తున్న తన కుటుంబంలోని 13వ తరం వ్యక్తిని తానేనని జలాలుద్దీన్ తెలిపాడు. అమ్మవారికి ఇలా సేవ చేయడం తన పూర్వ జన్మ సుకృతం అన్నాడు. మరి ఈ అరుదైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.