వినాయక చవితి ఉత్సవాలకు దేశం మొత్తం సిద్ధమైంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా వినాక ఉత్సవాలకు జరగలేదు. ప్రస్తుతం కోవిడ్ కేసులు అదుపులోకి రావడంతో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్దమయ్యారు. గణనాథుల కోసం భారీ సెట్టింగ్ లతో మండపాలను సిద్ధం చేస్తున్నారు. ఇక గణపతి ఉత్సవాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది మహారాష్ట్ర. ఇక్కడ జరిగే వినాయక చవితి నవరాత్రులకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ముంబయిలోని ఓ గణేశ్ మండపం వార్తలో నిలిచింది. ఎందుకంటే ఇక్కడి గణనాథుడు కోసం ఏర్పాటు చేసిన మండపానికి ఏకంగా రూ.316 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించారు నిర్వహకులు. ముంబయిలోని కింగ్స్ సర్కిల్ లో జీఎస్బీ(GSB) సేవా మండలి ఏర్పాటు చేసిన ఈ మండపం దేశంలోనే ఖరీదైనది గా నిలిచింది.
జీఎస్బీ ఏర్పాటు చేసిన ఈ మహా గణపతికి 66కేజీలకు పైగా బంగారపు ఆభరణాలు, 295 కిలోల వెండీ ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులతో అలంకరిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఇక ఈ మండప నిర్వహణ చూసే వారితో పాటు స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం కూడా రూ.316 కోట్ల బీమా చేయించారు. ఈ మొత్తంలో రూ.31.97 కోట్లు మండపంలోని బంగారు, వెండి, ఇతర విలువైన ఆభరణలకు బీమా చేయించారు. మిగిలిన రూ.263 కోట్లు మండపానికేనని జీఎస్బీ సభ్యులు తెలిపారు. ఉత్సవాల్లో పాల్గొనే వాలంటీర్లు, పూజారులు, వంటవాళ్లు, పార్కింగ్, సెక్యూరిటీ సిబ్బంది ఈ బీమా పరిధిలోకి వస్తారు.
అలాగే, ప్రకృతి విపత్తుల నుంచి ప్రమాదాల కోసం ప్రత్యేకంగా మరో కోటి రూపాయల బీమా చేయించారు. దీని కిందకు ఫర్నీచర్, కంప్యూటర్లు, సీసీటీవీలు, స్కానర్ల వంటివి వస్తాయని నిర్వహకులు తెలిపారు. వినాయక చవితి నుంచి 10 రోజుల పాటు నిర్వాహకులు, భక్తులకు ఈ బీమా వర్తిస్తుందని, ఏటా ఇటువంటి ఇన్సురెన్స్ తీసుకుంటున్నప్పటికీ ఈ సారి రికార్డు స్థాయిలో గరిష్టంగా బీమా చేయించినట్లు నిర్వహకలు తెలిపారు. న్యూ ఇండియా అస్యూరెన్స్ నుంచి ఈ మండప నిర్వహకులు ఇన్సూరెన్స్ తీసుకున్నారు.
2017లో రూ. 264.25 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకోగా.. 2018లో ఈ రూ.265 కోట్లకు బీమా చేయించింది. 2019లో గణేష్ మండపానికి రూ.266.65 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకుంది. గత రెండేళ్లు కొవిడ్ కారణంగా సంబరాలను ఘనంగా నిర్వహించలేదు. ఈ మండపం వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. దేశంలోనే ఈ గణపయ్య ఫుల్ రిచ్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఇంత భారీ మొత్తం బీమా చేయిండంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.