సాంకేతికత ఎంత పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెరిగిపోతున్న టెక్నాలజీతో మనిషి జీవితం ఎంతో సులభతరం అవుతోంది. కానీ, సాంకేతికత వల్ల నష్టాలు ఉన్నాయని కూడా వాదిస్తుంటారు. కానీ, ఇప్పుడు ఆ టెక్నాలజీ వల్ల ఓ మనిషి ప్రాణం కాపాడబడింది.
సాంకేతికత ఎంతో పెరిగిపోయింది. ఇప్పుడు పెరిగిన ఈ టెక్నాలజీతో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయిందని చెబుతూ ఉంటారు. అయితే ఇది కేవలం మాటల్లోనే కాదు.. చేతల్లో కూడా నిజమని తేలింది. ఎందుకంటే ఆ టెక్నాలజీనే ఇప్పుడు ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్లు ఇక్కడ ఇండియాలో ఉన్న ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రాణాలను కాపాడగలిగారు. అభివృద్ధి చెందిన టెక్నాలజీ వల్లే ఇది సాధ్యమైందని చాలా మంది భావిస్తున్నారు. అయితే అసలు అది ఎలా సాధ్యమైంది? ఇండియాలో ఉన్న టెకీ ప్రాణాలను అమెరికా ఏజెన్సీ ఎలా కాపాడిందో చూద్దాం.
అధికారులు, పోలీసుల వివరాల ప్రకారం.. ముంబైలోని జోగేశ్వరీ ప్రాంతంలో 25 ఏళ్ల యువకుడు నివసిస్తున్నాడు. అతడు ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. అయితే అతను ఎడ్యుకేషన్ లోన్, హౌస్ లోన్ అంటూ చాలా లోన్స్ తీసుకున్నాడు. చివరికి ఇంటి లోను వాయిదాలు చెల్లించలేని పరిస్థితికి వెళ్లిపోయాడు. గత కొంతకాలంగా ఆ యువకుడు డిప్రెషన్ లో ఉన్నాడు. ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమమని భావించాడు. అనుకున్నదే తడవుగా ఆత్మహత్య చేసుకునేందుకు మార్గాలను వెతకడం ప్రారంభించాడు. అలా అతను చేసిన ప్రయత్నాలే అతడి గురించి తెలిసేలా చేశాయి.
ఆ యువకుడు నెట్ లో ఆత్మహత్యకు మార్గాలు వెతకడం ప్రారంభించాడు. నొప్పిలేకుండా చనిపోవడం ఎలా అంటూ వెతుకడం చేస్తున్నాడు. అయితే యువకుడు వెతికే కీ వర్డ్స్ ద్వారా అమెరికాలోని లా ఎన్ ఫోర్సమెంట్ ఏజెన్సీ అతను ఆత్మహత్య చేసుకోవాలని చూస్తున్నట్లు గ్రహించింది. వెంటనే న్యూఢిల్లీలో ఉండే ఇంటర్ పోల్ కార్యాలయానికి అతని ఐపీ అడ్రస్, ఆత్మహత్య చేసుకోవాలని చూస్తున్న విషయాన్ని తెలియజేసింది. వాళ్లు ముంబై పోలీసులను అలర్ట్ చేయగా.. యువకుడిని వెతికి పట్టుకుని కౌల్సిలింగ్ తర్వాత తల్లిదండ్రులకు అప్పగించారు. అతను గతంలో కూడా రెండు, మూడుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిపారు.