సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్(82) సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ములాయం సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమించి..సోమవారం ఉదయం మరణించారు. దీంతో యూపీ రాజకీయాల్లో మరో శకం ముగిసింది. యూపీ రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో సైతం ములాయం సింగ్ ఎంతో కీలక పాత్ర పోషించారు. ఆయన రాజకీయ జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. అలానే ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో మలుపులు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన సంసార జీవితంలో అనేక మలుపు జరిగాయి. మొదటి భార్య బతికుండగానే సాధనా గుప్తాతో సహజీవనం చేశారు.
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఢిల్లీలోని గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. దేశ, యూపీ రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎన్నో గెలుపులను, మలుపులను చూశారు. అదే విధంగా ములాయం సింగ్ వ్యక్తిగత జీవితంలో కూడా అనేక ట్విస్టులు ఉన్నాయి. ములాయం సింగ్ యాదవ్ కి ఇద్దరు భార్యలు. అయితే మొదట భార్య మాల్తీ దేవి బతికుండగానే.. సాధన గుప్తా అనే మహిళతో ములాయం సింగ్ సహజీవనం చేశారు. ములాయం 2007లో తన ఆదాయానికి సంబంధించి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో అతని రెండో భార్య సాధనా గుప్తా మొట్టమొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. వారికి వివాహం జరిగిందని ములాయం చెప్పేంత వరకు బయటి ప్రపంచానికి తెలియదు.
అంతేకాదు అఫిడవిట్‌లో ప్రతిక్ యాదవ్ ను కూడా వారి కొడుకుగా ములాయం సింగ్ పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిక్ యాదవ్.. సాధనా గుప్తాకు తన మొదటి భర్త చంద్ర ప్రకాశ్ కు పుట్టిన బిడ్డ. ఇక సాధన గుప్తా విషయానికి వస్తే.. ఆమె ఉత్తర ప్రదేశ్ లోని ఇటావాలోని బిధునా తహసీల్ లో ఉండేది. ఆమెకు 1986లోనే పరూఖాబాద్ కు చెందిన చంద్రప్రకాష్ గుప్తాతో వివాహం జరిగింది. వీరిద్దరికి ప్రతీక్ యాదవ్ జన్మించాడు. అతడు పుట్టిన రెండేళ్లకు సాధన, చంద్రప్రకాష్ విడిపోయారు. ఇద్దరూ కోర్టు ద్వారా విడాకులు సైతం తీసుకున్నారు. అనంతరం ఆమె సమాజ్ వాదీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే వారు. ఈ క్రమంలో సాధన గుప్తాకి.. ములాయం సింగ్ యాదవ్‌తో పరిచయం ఏర్పడింది. ములాయం సింగ్ తల్లి మూర్తి దేవి అనారోగ్యంగా ఉన్న సమయంలో సాధన గుప్తా.. ఆమెకు సేవలు చేసేవారు. ‘చరిత్ర బద్లవ్ కి లేహర్’ అనే పుస్తకంలో సాధన, ములాయం సింగ్ యాదవ్ ల పరిచయం గురించి ఉంది. దాని ప్రకారం మూర్తిదేవికి ఓ నర్స్ తప్పుడు ఇంజెక్షన్ ఇవ్వబోతే.. సాధనా గుప్తా ఆపారు.
ఆ విషయం తెలుసుకున్న ములాయం సింగ్.. సాధన గుప్తా పై ఇష్టం ఏర్పడింది. ఆ ఘటన వారిద్దరి బంధానికి బీజం వేసింది. అలా మొదటి భార్య బతికుండగానే సాధన గుప్తాతో ములాయం సింగ్ సహజీవనం చేశాడు. అనారోగ్యంతో బాధపడి మాల్తీ దేవి 2003లో మరణించారు. మాల్తీదేవి, ములాయం సింగ్ యాదవ్ ల కుమారుడే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. ములాయం సింగ్ యాదవ్ మొదటి భార్య అయిన మాల్తీ దేవి మరణించిన తర్వాత మాత్రమే ములాయం సింగ్.. సాధన గుప్తాకు బహిరంగంగా భార్య హోదా కల్పించారు. సాధన గుప్తా, ఆయన కుమారుడు ప్రతీక్ కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ములాయం సింగ్ రెండో పెళ్లి కారణంగా.. వారి కుటుంబంలో విభేదాలు తలెత్తినట్టు వార్తలు వినిపించాయి. కాగా ఇటీవలే సాధనా గుప్తా కూడా మరణించారు.