దేశం ఆర్థికంగా బాగుంది. వందల కొద్దీ బిలియనీర్లు ఉన్నారని గొప్పలు చెప్పుకోవడం లేదు. ఆకలితో అలమటించేవారు.. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూసేవారు, ఉద్యోగం కోసం ఆఫీసుల వెంట తిరిగేవారు.. ఇలా ఒక్కరొక్కరిది ఒక్కో సమస్య. వీటన్నిటికీ పరిష్కారం చూపిన నాడే గొప్పలు చెప్పుకోవాలి.
‘జనాభాలో చైనాను మించిపోయాం..’, ‘2050కల్లా ప్రపంచంలో గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగబోతున్నాం..’ అంటూ గొప్పలు చెప్పుకునే మనం.. ఆకలి, పేదరికం, నిరుద్యోగం మాటకొచ్చేసరికి అన్నింటా వెనకే. దేశంలో దయనీయమైన పరిస్థితులు కళ్లకు కడుతున్నా.. ‘అయ్యో పాపం’ అనటం తప్ప ఏం చేయం. దేశంలో దయనీయమైన పరిస్థితులకు అద్దం పట్టే ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఘటన.
ఎలాంటి సమస్యల్లేని కుటుంబం వారిది. రోజువారీ సంపాదన నాలుగువందలైనా ఎంతో సంతోషంగా జీవించేవారు. అలాంటిది ఓ రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని తీవ్రవిషాదంలోకి నెట్టింది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న వారి బిడ్డ మంచానికి పరిమితమైంది. ఎల్లప్పుడూ ఇల్లంతా కలియతిరిగే కూతురు.. అలా మంచానికి పరిమితవ్వడాన్ని ఆ తండ్రి జీర్ణించుకోలేకపోయారు. ఎలాగైనా తన బిడ్డ లేచి నడవాలని ఇళ్లు, పొలం, ఆస్తులు.. ఇలా అన్నీ అమ్మి వైద్యం చేయించారు. అయినా ఫలితం దక్కలేదు. విధి ఆ తండ్రి ప్రయత్నాన్ని చిన్న చూపు చూసింది. చివరకు తన బిడ్డను కాపాడుకోలేనేమో అనే బెంగతో ఆర్థిక కష్టాల సుడిగుండంలో తన ప్రాణాలే తీసుకున్నాడు. గుండెల్ని పిండేసే ఈ విషాద సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాలు..
మధ్యప్రదేశ్, సాత్నా జిల్లా పరిధిలోని ట్రాన్స్‌పోర్ట్ నగర్ లో ప్రమోద్ గుప్తా దంపతులు నివసించేవారు. వీరికి ఒక్కగానొక్క కుమార్తె. పేరు.. అనుష్కా గుప్తా (17). ప్రమోద్ స్థానికంగా ఓ చిన్న దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేకునేవాడు. రోజుకు మూడు.. నాలుగు వందలు వచ్చినా ఎలాంటి కష్టాలు దరిచేరకుండా అన్యోన్యంగా జీవించేవారు. అయితే అనుకోని రోడ్డు ప్రమాదం వీరి కుటుంభాన్ని విషాదంలోకి నెట్టేసింది. ఐదేళ్ల క్రితం కూతురు అనుష్కా గుప్తా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె ప్రాణాలతో బయటపడ్డా, వెన్నెముక దెబ్బతినడంతో మంచానికే పరిమితమైంది. గుండెలపై పెట్టి పెంచుకున్న ఆ తండ్రి ప్రేమ.. కూతురు జీవచ్ఛవంలా పడిఉండటాన్ని జీర్ణించుకోలేకపోయింది.
“He Sold Blood For My Treatment But…”: Girl On Father’s Alleged Suicide
A man in Madhya Pradesh’s Satna allegedly died by suicide as he was dealing with a severe financial crisis.https://t.co/hsnqdW4nN6— Aman (@SherreAman) April 20, 2023
ఎలాగైనా కూతురు లేచి నడవాలని ఇళ్లు, పొలం, దుకాణం, ఆస్తులు.. ఇలా అన్నీ అమ్మి వైద్యం చేయించాడు. చివరకు అప్పులు చేసి మరీ మందులు, థెరపీలు చేయించాడు. అయినా ఆమెకు నయం కాలేదు. అధికారులు సాయం అందిస్తామని మాటిచ్చినా.. అది ముందుకు సాగలేదు. ఈలోపు ఆర్థిక సమస్యలు ఇంటిదాకా వచ్చాయి. చిన్నాచితకా పనులకు వెళ్లడం ప్రారంభించాడు. ఆ వచ్చే డబ్బు ఏపాటికీ సరిపోలేదు. ఇక లాభం లేదనుకొని.. తరచూ రక్తం అమ్మి ఇంట్లోకి నిత్యావసర సరుకులు తెచ్చేవాడు. రాను.. రాను.. పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. అతడు శక్తిహీనుడై పోయాడు. కూతురి కోసం తానేం చేయలేకపోతున్నాననే నిరాశ అతన్ని మానసికంగా కృంగదీసింది. ఈ క్రమంలో మంగళవారం వేకువజామున కూతురికి ఫోన్ చేసి, తనకు చావు తప్ప వేరే మార్గం కనిపించడం లేదని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అనతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
నిజానికి అనుష్కా గుప్తా పదో తరగతిలో జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఆమెను ఘనంగా సన్మానించారు. ప్రభుత్వం నుంచి ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని అప్పట్లో హామీ కూడా ఇచ్చారట. అందుకోసం థన్ తండ్రి వారి వెంట కళ్ళు అరిగేలా తిరిగాడని కూతురు చెప్పుకొచ్చింది. తన కోసం తండ్రి ఎంతో కష్టపడ్డాడని, కుటుంబాన్ని పోషించడానికి రక్తం అమ్మడంతో తండ్రి అనారోగ్యం పాలయ్యి.. చివరికి ప్రాణాలే తీసుకున్నాడంటూ ఆ బిడ్డ కన్నీటి పర్యాంతమైంది. బిడ్డ కోసం ఇన్ని చేసినా ఆ తండ్రి.. ఇంకొంచెం పోరాడి ఉంటే బాగుండేదేమో! ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.