ఆడ పిల్లలను నాలుగేళ్లగా బడికి పంపకుండా ఇంట్లోనే తాళం వేసి బంధించిందో తల్లి. ఈ విషయం తెలిసిన అధికారులు .. ఆమె ఇంటికి వెళ్లి ఎందుకు పిల్లలను పాఠశాలకు పంపడం లేదని అడగ్గా.. ఆ తల్లి చెప్పిన మాటలు విని ఖంగుతిన్నారు. ఆ తర్వాత ఆమెను సముదాయించేందుకు ప్రయత్నించారు.
పిల్లలను పెంచి పెద్ద చేసేందుకు తల్లిదండ్రులు పడే అగచాట్లు అన్నీ ఇన్నీ కాదు. అందులోనూ ఆడ పిల్లల విషయంలో మరింత భారంగా ఫీలవుతుంటారు. అయితే నేటి సమాజంలో ఆ వ్యత్యాసాలను చెరిపేస్తూ.. మగ పిల్లలతో సమానంగా ఆడ పిల్లలను కూడా చదివిస్తున్నారు. అయితే కొన్ని సార్లు తల్లిదండ్రుల అతి గారాభం, అతి ప్రేమ లేదా అతి ఆలోచనలు పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. టీచర్లు తిట్టారని, కొట్టారని చెబితే చాలు వారిపైకి రయ్‌న వెళ్లిపోతుంటారు. దీని వల్ల ఒక్కొక్కసారి పిల్లలు చదువులకు దూరమౌతున్నారు. అటువంటిదే ఎదుర్కొన్నారు ఓ ముగ్గురు ఆడ పిల్లలు.
వివరాల్లోకి వెళితే తమిళనాడులోని కన్యాకుమారిలోని రనియల్‌లో మురుగన్, ప్రేమ కుటుంబం నివసిస్తోంది. వీరికి ముగ్గురు ఆడ పిల్లలు. ప్రేమ భర్త కేరళలో ఉద్యోగం చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి పోతుంటాడు. అయితే ప్రేమ నాలుగేళ్ల నుండి ముగ్గురు కుమార్తెలను స్కూల్‌కు పంపకుండా ఇంట్లోనే బంధించింది. బయటకు వెళ్లేటప్పుడు కుమార్తెలను ఇంట్లో ఉంచి తాళం వేసేది. నాలుగేళ్లుగా ఇలా చేస్తుండగా.. చుట్టుప్రక్కల వారు ఈ విషయాన్ని అధికారులకు సమాచారం అందించారు. ప్రేమ తన ముగ్గురు కుమార్తెలను పాఠశాలకు పంపకుండా ఇంట్లోనే ఉంచిందని మున్సిపాలిటీ అధ్యక్షులు అందజేసిన సమాచారంతో శిశు సంక్షేమం, భద్రతా శాఖ అధికారులు, పోలీసులతో కలసి ఆమె ఇంటికి వెళ్లారు.
అయితే ప్రేమ వారిని ఇంటి లోనికి వెళ్లనివ్వకుండా అడ్డుకోవడమే కాదూ.. వచ్చిన అధికారులతో దురుసుగా మాట్లాడింది. వారితో వాగ్వాదానికి దిగింది. వారిని ఎందుకు పాఠశాలకు పంపడం లేదని అడగ్గా.. అసలు కారణం తెలిసి విస్తుపోవడం అధికారుల వంతైంది. నాలుగేళ్ల క్రితం యూనిఫాం వేసుకోకుండా బడికి వెళ్లిన తన కుమార్తెలను ఉపాధ్యాయులు కొట్టారని ప్రేమ చెప్పారు. ఈ విషయాన్ని తన కుమార్తెలు ఇంటికి వచ్చి ఏడ్చుకుంటూ చెప్పారని, దీంతో తన పిల్లల్ని వారు ఏమైనా చేస్తారని భయంతో పాఠశాలకు పంపకుండా ఇంట్లోనే ఉంచినట్లు తెలిపింది. ప్రేమను పక్కకు నెట్టి ఇంట్లోకి వెళ్లిన అధికారులు, బాలికలను విచారించారు. ప్రేమకు కౌన్సిలింగ్ ఇప్పించి, పిల్లలను మళ్లీ పాఠశాలకు పంపేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.