సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకోవాలని, వారు క్లాస్ ఫస్ట్ రావాలని కోరుకుంటారు. అలా తమ పిల్లలు ఫస్ట్ క్లాస్‌లో పాసైతే.. ఇక ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. అలాంటిది 100 శాతం మార్కులు సాధిస్తే ఎగిరి గంతేస్తారు. తమ పిల్లల గురించి అందరి దగ్గర గొప్పగా చెప్తుంటారు. కానీ ఓ తల్లి మాత్రం అందరికి భిన్నంగా ఉంది. ఆ అమ్మ..తన కూతురికి పదో తరగతిలో 100 శాతం మార్కులు వచ్చాయని బాధపడుతున్నారు. అయితే కూతురు అంత మంచి మార్కులు సాధిస్తే సంతోష పడేది పోయి.. ఎందుకు బాధపడుతుందనే సందేహం ప్రతి ఒక్కరి రావచ్చు. ఆమె బాధకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
హర్యానాలోని సిలార్పుర్ లో ఉంటున్న అంజలి యాదవ్ అనే విద్యార్థిని..మహోందర్‌గఢ్‌లోని ఇండస్ వాలీ పబ్లిక్ స్కూల్‌లో 10వ తరగతి చదవుతోంది. ఇటీవల CBSE ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాల‍్లో 100 శాతం మార్కులు సాధించింది. కానీ, ఆమె తల్లి మాత్రం బాధపడుతున్నారు. తన కుమారైను పైచదువులకు ఏ విధంగా పంపించాలో తెలియటం లేదని తనలో తానే మదన పడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కడాని కుటుంబం వారిది. ఇంత మంచి స్కోర్ రాకున్న ఆశ ఉండేది కాదని, మంచి మార్కులు వచ్చి, తాము చదివించే స్థోమత లేకపోయే సరికి బాధగా ఉందని అంజలి తల్లి ఉర్మిళ తెలిపారు.
విద్యార్థిని తండ్రి 2010 రోడ్డు ప్రమాదానికి గురై.. అనంతరం అనారోగ్య సమస్య కారణంగా 2017లో తన విధుల నుంచి వైదొలిగారు. ఆ సమయంలో పీఎఫ్ ద్వారా రూ.10 లక్షలు అందాయి. కానీ, అవి అప్పులు, ఇతర ఖర్చులకే అయిపోయాయని విద్యార్థిని తల్లి ఊర్మిళ తెలిపారు. విద్యార్థిని సోదరుడు ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాడు. తాను కష్టపడి చదివి కుటుంబానికి అండగా నిలబడతాన్ని అంజలి అంటుండేదని, అయితే తమ ఆర్థిక స్థితి కారణంగా ఆమె పై చదువులు పంపడం భారమవుతుందని ఊర్మిళ అన్నారు.
ఈ క్రమంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ ఆదివారం ఫోన్ చేసి విద్యార్థినిని అభినందించారు. ఈ క్రమంలో తన కుటుంబ పరిస్థితుల గురించి సీఎంకు వివరించింది విద్యార్థిని. దీంతో ఆమెకు నెలకు రూ.20వేల స్కాలర్‌షిప్ ప్రకటించారు ముఖ్యమంత్రి. అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థిని కుటుంబ సభ్యులు హర్యానా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.