ఒక మహిళ తన కుటుంబంలో అధిక ప్రాధాన్యత నిచ్చేది తన కడుపున పుట్టిన బిడ్డలకే. పుట్టిన పిల్లలు, ఎదిగి ప్రయోజకులైతే మొదట ఆనందించేది తల్లే. తిండి తిప్పలు మానేసి అహర్నిశలు వారి అభివృద్ధికి తోడ్పడుతుంది. అదే బిడ్డ అయురార్థంతో కన్నుమూస్తే తల్లి పేగు తల్లడిల్లిపోతుంది. కళ్ల ముందు తనువు చాలిస్తే ఆ తల్లి పడే వేదన వర్ణనాతీతం. ఇటువంటి విషాదం పగవాటి కూడా రాకూడదని అనుకుంటాం. కడు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నఆ తల్లి కూడా అదే వేదన చెందింది. తన బిడ్డ అనారోగ్యంతో చనిపోతే.. కనీసం అంత్యక్రియలు కూడా చేయలేని నిస్సహయ స్థితిలో ఉన్న ఆమె ఏం చేసిందంటే..?
చనిపోయిన తన కుమార్తెను ఒళ్లో పెట్టుకుని, దహన సంస్కారాలకు సాయం చేయాలని అభ్యర్థిస్తూ ఇంటింటా తిరిగింది. ఈ హృదయ విదారక ఘటన చత్తీస్ గఢ్‌లో చోటుచేసుకుంది. కాంకేర్ జిల్లా మలంజికుండమ్ కి చెందిన మన్సు గవాడే,లక్మణ్ గవాడే భార్యా భర్తలు. వీరికి పెళ్లే నాలుగేళ్లు అయింది. రెండేళ్ల క్రితం వీరికి ఆడపిల్ల జన్మించింది. అయితే పుట్టిన బిడ్డ అనారోగ్యానికి గురికావడంతో.. చికిత్స చేయించేందుకు తండ్రి ససేమీరా అన్నాడు. వారిద్దరినీ వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో పాప పోషణ భారం అంతా ఆమెపై పడింది. అయితే చర్చికి వెళుతుందన్న కారణంగా పుట్టింటి వాళ్లు కూడా మన్సును చేరదీయలేదు. చివరికీ ఆ పాప ఈ నెల 4న పౌష్టికాహార లోపంతో చనిపోయింది.
కుమార్తె మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు పైసా కూడా తన దగ్గర లేకపోవడంతో తల్లి ఆవేదన చెందింది. పాప మృతదేహాన్ని భుజాలపై వేసుకుని శనివారం సాయంత్రం నుండి ఆదివారం వరకు ఇంటింటికీ తిరిగి, భిక్షాటన చేసింది. ఏ ఒక్కరూ ఆమెకు సరైన సాయం చేయలేదు. ఈ విషయం అధికారుల దృష్టిలో వెళ్లడంతో.. వారే పాప మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కుమార్తె చనిపోవడంతో పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆమె మానసిక స్థితి కూడా సరిగా లేదని గుర్తించిన అధికారులు సఖి కేంద్రానికి తరలించారు. ఆమెకు వైద్యం అందజేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నారు. కుమార్తె అంత్యక్రియల కోసం ఆమె భిక్షాటన చేసినా.. జనం సరిగా స్పందించకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి