సాధారణంగా కోతులు ఇండ్లలోకి దూరి చిన్న చిన్న వస్తువులు, ఆహార పదార్థాలు తీసుకు వెళ్లడం చూస్తుంటాం. అయితే ఓ వ్యక్తి టవల్‌లో చుట్టిపెట్టిన లక్ష రూపాయల డబ్బును ఒక కోతి ఎత్తుకెళ్లిపోయింది. అంతేకాదు ఆ టవల్ విదిలించి డబ్బును రోడ్డుపై వెదజల్లింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కటవ్ ఘాట్ ప్రాంతంలో జరిగింది.
ఆటోలో ఓ వ్యక్తి రూ. లక్ష నగదును టవల్‌లో చుట్టి ప్రయాణిస్తున్నాడు. అతనితో పాటు మరో ఇద్దరు ఉన్నారు. మార్గమధ్యంలో ట్రాఫిక్ జామ్ అయింది. ఎంత సేపటికీ ఆటో కదలకపోవడంతో ఆటోలోని ముగ్గురు వ్యక్తులూ కిందకు దిగారు. అదే సమయంలో పక్కన చెట్టు మీద నుంచి ఓ కోతి వచ్చి టవల్ లో చుట్టిన లక్షరూపాయల నగదు ఎత్తుకు వెళ్లింది. తినడానికి ఏమీ లేదనుకొని మూటలోని డబ్బు రోడ్డుపై చిందర వందరగా పడింది. దాంతో ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయిన వారిలో చాలా మంది ఆ డబ్బు కోసం ఎగబడ్డారు.
కొందరు నిజాయతీపరులు డబ్బు సేకరించి యజమానికి తిరిగిచ్చారు. కానీ కొంత మంది మాత్రం దొరికిందే ఛాన్సురా అంటూ డబ్బులు జేబులో వేసుకొని తుర్రుమన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో డబ్బు ఎవరు తీసుకున్నదీ తెలుసుకోవడం కుదరలేదని చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలోని ఇరుకైన రహదారిపై ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న ఆటోరిక్షా నుండి ఒక లక్ష రూపాయల నగదు చుట్టబడిన ఒక టవల్‌ను కోతి లాక్కున్నట్లు పోలీసులు తెలిపారు. కటవ్ ఈ ఘటన జరిగిందని మజోలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సచిన్ సింగ్ తెలిపారు. ఈ ఘటనలో ఎవరిపైనా కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలియజేశారు.