సినిమా హీరోలు, క్రికెటర్లు, రాజకీయ నేతలు వంటి సెలబ్రిటీలకు ఫ్యాన్లు ఉండటం సాధారణం. అభిమాన తారలు, నేతలు, క్రికెటర్ల ఫోటోలను ఇంట్లో పెట్టుకోవడం లేదంటే వారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం చేస్తుంటారు. అన్నదానాలు, రక్త దాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ అభిమానంలో నా దారే వేరయ్యా అనిపించుకున్నాడో స్వర్ణ కారుడు. అతనికి ప్రధాని మోడీ అంటే అమితమైన ప్రేమ. ఆ ప్రేమను ఓ కళా ఖండంగా మలిచాడు. తనకు ఇష్టమైన నేతను గుండెల్లో గుడి కట్టుకోవడమే కాదూ.. బంగారు విగ్రహాన్ని రూపొందించి మోడీపై ఎనలేని ప్రేమను చాటుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్ లోని సూరత్ కు చెందిన బంగారు వ్యాపారి బసంత్ బోహ్రాకి మోడీ అంటే విపరీతమైన గౌరవం. గుజరాత్ లో మొత్తం 182 స్థానాలకు గానూ బిజెపికి 156 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించడంతో దానికి గుర్తుగా తన ఫ్యాక్టరీలో 156 గ్రాముల బంగారంతో మోడీ విగ్రహాన్ని రూపొందించి.. బొంబే గోల్డ్ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేశారు.ఈ విగ్రహాన్ని చూసినవారంతా వాహ్ అని అంటున్నారు. ప్రస్తుతం మీడియాలోనూ ఈ విగ్రహం వైరల్ గా మారింది.
బసంత్ బోహ్ర స్వస్థలం రాజస్తాన్ అయినప్పటికీ.. 20 ఏళ్లుగా సూరత్ లో ఉంటున్నారు. అక్కడే రాధికా చైన్స్ అనే సంస్థను స్థాపించి.. బంగారం క్రయ, విక్రయాలు చేస్తుంటారు. 18 క్యారెట్ల బంగారాన్ని వినియోగించి 156 గ్రాముల విగ్రహాన్ని రూపొందించారు. ఇందు కోసం 20 మంది స్వర్ణకళాకారులు కొన్ని రోజుల పాటు శ్రమించారని బోహ్ర తెలిపారు. ఈ విగ్రం 4.5 అంగుళా పొడవు, 3 అంగుళా వెడల్లుతో తయారు చేశారు. ఈ విగ్రహం తయారీకి రూ. 10. 5 లక్షల ఖర్చు చేసినట్లు చెప్పారు. దీన్ని తాను అమ్మాలని అనుకోవడం లేదని తెలిపారు. దీన్ని ప్రధాని మోడీకి బహుమతిగా ఇస్తానని తన స్నేహితుడు చెప్పారన్నారు. మరీ ఈ అభిమానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.