ఇటీవల కాలంలో ఫోన్లు పేలిపోతున్న ఘటనలు తరచుగా వింటున్నాం. ఓ వ్యక్తి తన చొక్కా జేబులో పెట్టుకున్న ఫోన్ ఒక్కసారిగా పేలింది.
ఇటీవల కాలంలో ఎలక్ట్రానిక్ వస్తువులు పేలిపోతున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయి. జేబులో పెట్టుకున్న స్మార్ట్ ఫోన్లు, ఛార్జింగ్ పెట్టిన ఫోన్లు పేలిపోతున్నాయి. తాజాగా ఓ వృద్ధుడి జేబులో ఉన్న మొబైల్ ఫోన్ పేలిపోయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి వృద్ధుడు వేసుకున్న చొక్కాకు అంటుకున్నాయి. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలోని మరోట్టిచల్ ప్రాంతానికి చెందిన ఇలియాస్ (76) ఓ హోటల్ కి వెళ్ళాడు. హోటల్లో కుర్చీలో కూర్చుని టీ తాగుతున్నాడు. అతని చొక్కా జేబులో కీ ప్యాడ్ మొబైల్ ఫోన్ ని ఉంచాడు. అయితే ఉన్నట్టుండి ఆ మొబైల్ ఫోన్ పేలింది. వెంటనే మంటలు చెలరేగాయి.
అది గమనించిన వృద్ధుడు వెంటనే అప్రమత్తమై జేబులో ఉన్న ఫోన్ ని కిందకి విసిరేసాడు. దీంతో అతనికి ప్రమాదం తప్పింది. ఏడాది క్రితం స్థానికంగా ఉన్న ఓ మొబైల్ షాప్ లో వెయ్యి రూపాయలకు ఈ మొబైల్ ఫోన్ ని కొనుగోలు చేశానని.. ఎప్పుడూ ఎలాంటి ట్రబుల్ ఇవ్వలేదని, ఈ ఘటనలో తనకు ఎలాంటి గాయాలు కాలేదని ఇలియాస్ వెల్లడించాడు. మొబైల్ పేలిన ఘటనకు సంబంధించిన వీడియో హోటల్ సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యింది. స్మార్ట్ ఫోన్లే కాదు, కీ ప్యాడ్ ఫోన్లు కూడా పేలిపోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కేరళలో ఇలాంటి పేలుడు ఘటనలు జరగడం ఇది మూడోసారి. కేరళలోని త్రిస్సూర్ లో ఏప్రిల్ 24న 8 ఏళ్ల పాప మొబైల్ ఫోన్ వాడుతుండగా ఒక్కసారిగా పేలిపోవడంతో అక్కడిక్కడే మృతి చెందింది.
కోజీకోడ్ లోని పయ్యనక్కల్ లో రియల్ మీ 8 స్మార్ట్ ఫోన్ పేలిపోయింది. 23 ఏళ్ల రహ్మాన్ రెండేళ్లుగా రియల్ మీ 8 ఫోన్ వాడుతున్నాడు. అప్పటివరకూ బాగానే పని చేసిన ఫోన్.. ఒక్కసారిగా హీటెక్కి మంటలు వ్యాపించాయి. ప్యాంటు జేబులోంచి మంటలు వ్యాపించడంతో రహ్మాన్ ప్యాంటుని విప్పేసి విసిరేశాడు. అప్పటికే అతని కాలు కాలిపోయింది. అయితే అదృష్టవశాత్తు అతని ప్రాణానికి ఎలాంటి హాని జరగలేదు. లక్కీగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. తాజాగా ఓ వృద్ధుడు కూడా తన జేబులో ఉన్న ఫోన్ లోంచి మంటలు రావడంతో వెంటనే అప్రమత్తమై ప్రమాదం నుంచి బయటపడ్డాడు.