కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వినూత్న పథకాలకు శ్రీకారం చుడుతున్నారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఈ క్రమంలోనే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన పథకాలకు శ్రీకారం చుడుతుంది. ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేస్తుంది. ఈ క్రమంలోనే “శక్తి యోజన” కింద ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ఆదివారం ప్రారంభించింది.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా ఎమ్మెల్యే బస్సు నడపగా అపశృతి చోటుచేసుకుంది.
కేజీఎఫ్‌లోని కువెంపు బస్టాండ్‌లో శక్తి పథకం, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభోత్సవం సందర్భంగా కేజీఎఫ్ ఎమ్మెల్యే రూపకళ ఆదివారం కేఎస్‌ఆర్‌టీసీ బస్సును నడిపారు. పార్టీ కార్యకర్తలతో కలిసి మహిళా ప్రయాణికులకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన బస్సును ప్రారంభించారు. అయితే మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు రమేష్‌కుమార్ పట్టుబట్టడంతో రూపకళ బస్సును నడిపే సాహసం చేసింది. బస్సు డ్రైవర్ గేర్ మార్చడంలో సహకరించడంతో ఎమ్మెల్యే వాహనం దిగే ముందు 100 మీటర్లు బస్సును నడిపారు.
అనంతరం ఆమె మద్దతుదారుల పట్టుబట్టడంతో ఎమ్మెల్యే మరో బస్సును నడిపారు. ఈసారి రూపకళ స్వయంగా గేర్ మార్చేందుకు ప్రయత్నించి విఫలమైంది. దీంతో బస్సుకాస్త వెనుకకు వెళ్లి అక్కడ నిలిపి ఉన్న కార్లను ఢీకొట్టి ఆగిపోయింది. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై బస్సును కంట్రోల్ చేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.