రిజర్వేషన్ల రగడ ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో అగ్గి రాజేసింది. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణలు చెలరేగి హింసాత్మకంగా మారాయి. వీటిని అదుపు చేసేందుకు ఆర్మీ, అసోం రైఫిల్స్ రంగంలోకి దిగాయి.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ రణరంగాన్ని తలపిస్తోంది. మైతీలకు ఎస్టీ హోదా ఇవ్వడంపై గిరిజనులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో రాష్ట్రంలోని 8 జిల్లాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆయా జిల్లాలలో అధికారులు కర్ఫ్యూ విధించారు. ఇంకా కొన్నిచోట్ల ఘర్షణలు జరుగుతుండడంతో.. వాటిని అదుపు చేసేందుకు ఆర్మీ, అసోం రైఫిల్స్ రంగంలోకి దిగాయి. ఈ హింస కారణంగా రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవల్ని ప్రభుత్వం ఐదు రోజుల పాటు నిలిపివేసింది.
మైతీలకు ఎస్టీ హోదా ఇవ్వడాన్ని నిరసిస్తూ.. బుధవారం ఏటీఎస్‌యూఎం ఆధ్వర్యంలో గిరిజన సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. మణిపూర్ జనాభాలో మైతీ సామాజిక వర్గం 53 శాతం. ఈ వర్గం వారు తమను ఎస్‌టీ జాబితాలో చేర్చాలని ఇటీవల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ ఉద్యమం ఊపందుకోవడంతో.. వారికి వ్యతిరేకంగా గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణలు చెలరేగి అది తీవ్రరూపం దాల్చింది. దీన్ని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు.. ఇప్పటివరకు సమస్యాత్మక ప్రాంతాల్లోని 7,500 మంది ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలించాయి. రాజధాని ఇంఫాల్, చుర్‌చంద్‌పూర్, కాంగ్‌పోక్పి సహా పలు సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.
Today in #Manipur #ManipurOnFire pic.twitter.com/8GuEjFDaov
— Брат (@B5001001101) May 4, 2023
ఇదిలావుంటే.. ‘మణిపూర్ కాలిపోతోంది, దయ చేసి ఆదుకోండి..’ అంటూ బాక్సర్ మేరీ కోమ్ ట్వీట్ చేశారు. గత రాత్రి నుంచి మణిపూర్‌లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారినట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఈ హింస కారణంగా కొందరు తమ కుటుంబసభ్యుల్ని కోల్పోవడం దురదృష్టకరమన్నారు. కాగా, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీసినట్లు తెలుస్తోంది. శాంతిభద్రతల పునరుద్ధరణకు చేపడుతున్న చర్యల గురించి ముఖ్య మంత్రి బీరెన్ సింగ్ తో మాట్లాడినట్లు సమాచారం.
My state Manipur is burning, kindly help @narendramodi @PMOIndia @AmitShah @rajnathsingh @republic @ndtv @IndiaToday pic.twitter.com/VMdmYMoKqP
— M C Mary Kom OLY (@MangteC) May 3, 2023