ఫలాలకు రాజు మామిడి పండు. కేవలం ఎండాకాలంలోనే దొరికే మామిడి పండ్లకోసం పడి చచ్చేవారు చాలా మంది ఉన్నారు. సాధారణంగా రకాన్ని బట్టి మామిడి పండ్ల ధరలు ఉంటూ ఉంటాయి.
ఈ నాగరిక ప్రపంచంలో జీతాలు లేని జీవితాలు ఉన్నాయేమో కానీ ఈఎమ్‌ఐలు లేని జీతగాళ్లు లేరు. దినసరి కూలీలైనా సరే ఈఎమ్‌ల మీద ఏదో ఒక వస్తువు కొంటున్న రోజులివి. ఇంట్లో వంటకు ఉపయోగించే కుక్కర్ దగ్గరినుంచి పెద్ద పెద్ద కాస్ట్‌లీ భవనాల వరకు అన్నీ ఈఎమ్‌ఐలకు లభిస్తున్నాయి. తిన్నా తినకపోయినా ప్రతీ నెలా ఇన్‌స్టాల్‌మెంట్‌ల ద్వారా కొంత మొత్తాన్ని చెల్లిస్తూ తెచ్చుకున్న వస్తువును చూసుకుని మురిసిపోతూ ఉంటారు కొందరు. సాధారణంగా తినే వస్తువులకు ఈఎమ్‌ఐ ఉండదు. ఇందుకు భిన్నంగా ఉండాలని ఆలోచించిందో లేదా మార్కెటింగ్ స్ట్రాటజీనో తెలియదు కానీ, మామిడి పండ్లు అమ్మే ఓ షాపు పండ్ల అమ్మకాల్లో కొత్త పద్దతిని ఫాలో అవుతోంది.
ఎండాకాలంలో దొరికే మామిడి పండ్లను ఈఎమ్‌ఐల రూపంలో అందుబాటులోకి తెచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని పుణెకు చెందిన గురుక్రిప ట్రేడర్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ ప్రాడెక్ట్స్.. హోల్‌సేల్ ధరకు పలు రకాల పండ్లు విక్రయిస్తూ ఉంటుంది. ఇది ఎండాకాలం కాబట్టి ఎక్కువ మంది మామిడి పండ్లు తినటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే షాపు యజమాని గౌరవ్ సనాస్ ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నాడు. ఎక్కువ ధర ఉన్న మామిడి పండ్లను ఈఎమ్‌ఐల ద్వారా విక్రయిస్తోంది. అల్ఫోన్స్ రకానికి చెందిన మామిడి పండ్లు కిలో 800 నుంచి 1300 రూపాయలు ఉంటున్నాయి.
ఇంత పెద్ద మొత్తం పెట్టి పేదలు మామిడి పండ్లు కొనటం చాలా కష్టం. అందుకని వాటిని ఈఎమ్‌ల ద్వారా అమ్మాలని నిర్ణయించుకుంది. క్రెడిట్ కార్డు ద్వారా ఈఎమ్‌ఐని పొందవచ్చు. మూడు నుంచి 12 నెలల వరకు ఇన్‌స్టాల్‌మెంట్లను పెట్టొచ్చు. అయితే, ఈ ఈఎమ్‌ఐల ఆప్చన్ కేవలం 5 వేల రూపాయలకు పైగా అమ్మకాలు చేసిన వారికే వర్తిస్తుంది. దీనిపై గురుక్రిప ట్రేడర్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ ప్రాడెక్ట్స్ యజమాని గౌరవ్ మాట్లాడుతూ.. ‘‘ సీజన్ మొదలైన కొత్తలో మామిడి పండ్ల ధరలు చాలా అధికంగా ఉంటాయి. సాధారణంగా ఫ్రిజ్‌లు, ఏసీలు, ఇతర వస్తువులు ఈఎమ్‌ఐల ద్వారా అందుబాటులో ఉంటూ ఉంటాయి. మరి, మామిడి పండ్లు ఎందుకు కాకూడదు. అలా చేస్తే అందరూ మామిడి పండ్లను కొనవచ్చు కదా’’ అని అన్నారు.