వేసవి వచ్చిందంటే చాలు మామిడి సందడి మొదలవుతుంది. ధనిక, పేద తేడా లేకుండా అందరు తినే పండ్లు మామిడి. నగరంలో ఎక్కడ చూసిన ఇవే కనిపిస్తూ ఉంటాయి. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో పండే ‘నూర్జహాన్’ మామిడి పళ్లకు ఈసారి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గతేడాదితో పోలిస్తే పండు పరిమాణం కూడా పెద్దగా ఉండడం కలిసి వచ్చింది. ‘నూర్జహాన్’ మామిడి ఒక్కోటి ఈ సీజన్‌లో రూ. 500 నుంచి రూ. 1000 పలుకుతోందని వాటిని పండించిన రైతు తెలిపాడు. నూర్జహాన్ మామిడి ఆప్ఘాన్ మూలానికి చెందినదని స్థానికులు చెబుతున్నారు. వీటిని అలీరాజ్‌పూర్ జిల్లాలోని కత్తివాడ ప్రాంతాలో మాత్రమే పండిస్తారని పేర్కొన్నారు. ఇది ఇండోర్‌కు దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో గుజరాత్ సరిహద్దుకు ఆనుకుని ఉంటుంది. నూర్జహాన్ రకం మామిడి చెట్టు 250 పళ్లను మాత్రమే ఇస్తుందని కత్తివాడలో ఈ రకం మామిడిని పండించే రైతు శివరాజ్ సింగ్ జాదవ్ తెలిపారు. ఈ పండు ఒక్కో ధర రూ. 500 నుంచి రూ. 1000 వరకు ఉంటుందన్నాడు.
నూర్జహాన్ మామిడిని ఇష్టపడేవారు, పండ్ల ప్రేమికులు ముందస్తుగానే వీటిని బుక్ చేసుకుంటారని వివరించాడు. ఈసారి ఈ మామిడి పండు ఒక్కోటి 2 నుంచి మూడున్నర కేజీల బరువు ఉందని జాదవ్ తెలిపాడు. 2019లో ఒక్కో పండు 2.75 కేజల బరువుతో పండిందని, అప్పట్లో అత్యధికంగా ఒక్కో పండు ధర రూ. 1,200 పలికిందని గుర్తు చేశాడు. ఈ మామిడి పండ్లను పండించే అక్కడి తోటల్లో గత ఏడాది సానుకూల వాతావరణం లేకపోవడంతో అప్పట్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని మరో రైతు చెప్పాడు. ఈ సారి మాత్రం పరిస్థితులు పూర్తిగా అనుకూలించాయని వివరించాడు.