దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రతినిత్యం ఎక్కడో అక్కడ లైంగిక వేధింపుల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ వేధింపులు, దాడులు సామాన్య మహిళలపైనే కాదు సెలబ్రెటీలు, మహిళానేతలపై కూడా జరుగుతున్నాయి. మహిళా ఎమ్మెల్సీ నేత ప్రజలతో మాట్లాడుతున్న సందర్భంగా ఓ వ్యక్తి ఆమె చెంపపై బలంగా కొట్టాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటన అక్కడ కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్సీ ప్రజ్ఞా సాతవ్ బుధవారం సాయంత్రం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలతో మాట్లాడుతున్న సమయంలో ఓ 40 ఏళ్ల వ్యక్తి అక్కడికి అకస్మాత్తుగా వచ్చి ఆమెను లాగి చెంపదెబ్బ కొట్టాడు. ఒక్కసారే తనపై దాడి జరగడంతో షాక్ కి గురయ్యారు ప్రజ్ఞా సాతవ్. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అతన్ని పక్కకు లాగివేశారు. తనపై దాడి చేసిన వ్యక్తిపై ప్రజ్ఞా సాతవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక మహిళా ఎమ్మెల్సీకి రక్షణ లేకుండా పోయిందని.. మహిళలపై దాడులు చేసేవారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.
మహారాష్ట్ర హింగోలి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనందేకు పర్యటించారు. ప్రజలతో ముచ్చటిస్తున్న సందర్భంగా వ్యక్తి దాడి చేయడం అక్కడ కలకలం సృష్టించింది. బాధితురాలు దివంగత కాంగ్రెస్ నేత రాజీవ్ సావత్ సతీమణి. ఎమ్మెల్సీ ప్రజ్ఞా సాతవ్ పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. సామాన్యులకే కాదు రాజకీయ మహిళా నేతలపై దాడులు చేయడం దారుణం అని.. మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతుందని.. నింధితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.