సాధారణంగా అందరూ పరువునష్టం దావా గురించి వినే ఉంటారు. మీ పరువుకు భంగం కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే.. వారిపై మీరు పరువునష్టం దావా వేయచ్చు. అది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి సివిల్, రెండు క్రిమినల్ అని ఉంటుంది. దీనిలో మీరు కేసు నెగ్గితే డబ్బును పరిహారంగా పొందవచ్చు. అదే ఒకరి నిర్లక్ష్యం వల్ల ఎవరి ప్రాణమైనాపోతే ఏం చేయాలి? అలాంటి సమయంలోనూ కోర్టును ఆశ్రయించి.. కారణమైన వారి నుంచి పరిహారం కోరవచ్చు. కోర్టులో వారు కారణంగా తేలితే తప్పకుండా పరిహారం ఇప్పిస్తారు. ఇప్పటివరకు ఈ పరిహారం అనేది లక్షల్లో మాత్రమే చూశాం. కానీ, ఓ తండ్రి మాత్రం ఏకంగా రూ.1000 కోట్లు ఇప్పించమని కోరుతున్నాడు.
తన కుమార్తె కొందరి నిర్లక్ష్యం కారణంగా మరణించినట్లు ఆరోపిస్తూ.. ఆమె మరణానికి పరిహారంగా రూ.వెయ్యికోట్లు ఇప్పించాలంటూ కోర్టుకెక్కాడు. కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వం, సీరం సంస్థ, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. అతని పిటిషన్‌ను విచారణకు తీసుకున్న న్యాయస్థానం విచారణ జరపడమే కాకుండా.. పిటిషనర్ ఆరోపణలపై స్పందన తెలియజేయాలంటూ టీకా తయారీ సంస్థ సహా.. ప్రతివాదులను కోరింది. తదుపరి విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది.
ఈ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి మహారాష్ట్రకు చెందిన దిలీప్ లునావత్. అతని కుమార్తె స్నేహాల్ లునావత్ ఒక మెడికల్ స్టూడెంట్. నాసిక్‌లో చదువుతున్న ఆమెకు 2021 జనవరిలో కరోనా టీకాను వేశారు. ఆ టీకా వేసిన తర్వాత కొన్నిరోజులకు తీవ్ర జ్వరం, వాంతులు కావడంలో ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఆమె మెదడులో రక్తస్రావం కావడం, పరిస్థితి విషమించి మార్చి1 ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏఈఎఫ్‌ఐ సంస్థ అక్టోబరులో తమ నివేదికను సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగానే దిలీప్ లునావత్ కోర్టును ఆశ్రయించి పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశాడు. ఈ ఘనటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.