పామంటే భయపడని వారంటూ ఉండరు. కానీ, కొన్ని సార్లు తమకిష్టమైన వారికి పాము కరిచినపుడు పామంటే భయం పోయి కొత్త తెగువ వస్తుంది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి భార్య కోసం పామును ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
దేశంలో పాము కాటు ఘటనలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. సరైన వైద్య సహాయం అందని వారు ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. అంతేకాదు! ఏ పాము కాటుకు గురైతే దానికి సంబంధించిన విరుగుడు మందు వేయించుకోవాలి. లేదంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే డాక్టర్లు కూడా.. కరిచిన పాము ఏదో చెప్పమంటూ ఉంటారు. ఇలా చేయటం ద్వారా యాంటీ డోట్ త్వరగా ఇవ్వటానికి ఆస్కారం ఉంటుంది. అయితే, కొంతమంది వ్యక్తులు తమను కరిచిన పామును బతికుండగానే ఆస్పత్రికి తీసుకెళ్లి హల్‌చల్ చేశారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా చాలా జరిగాయి.
తాజాగా, ఓ వ్యక్తి తన భార్యను కరిచిన పామును సంచిలో వేసుకుని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. దీంతో ఆసుపత్రి వైద్యులు, ఇతర సిబ్బంది భయపడిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, ఉన్నావో జిల్లా, ఉమర్ అత్వా గ్రామానికి చెందిన నరేంద్ర, కుసుమ భార్యాభర్తలు. కొద్దిరోజుల క్రితం కుసుమ ఇళ్లు శుభ్రం చేస్తుండగా పాము కరిచింది. ఆ సమయంలో నరేంద్ర ఇంట్లో లేడు. ఇతర కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొంత సేపటి తర్వాత ఈ విషయం నరేంద్రకు తెలిసింది. వెంటనే ఇంటికి వెళ్లాడు. ఇంట్లో దాక్కున్న పామును వెతికి పట్టుకున్నాడు.
తర్వాత దాన్ని సంచిలో వేసుకుని ఆస్పత్రికి వెళ్లాడు. సంచిలో పాముందని తెలిసిన డాక్టర్లు, ఇతర సిబ్బంది భయపడిపోయారు. ఎందుకు పామును తెచ్చావు అని అడగ్గా.. ‘‘ నా భార్యను ఏ పాము కరిచిందో తెలిస్తేనే కదా.. డాక్టర్లు ట్రీట్‌మెంట్ ఇవ్వగలరు’’ అని జవాబిచ్చాడు. వైద్యులు ఆ పాము ఏంటో తెలుసుకుని.. కుసుమకు యాంటీడోట్ ఇచ్చారు. వైద్యం అనంతరం ఆ పామును క్షేమంగా అడవిలో వదిలేశారు. మరి, భార్య మీద ప్రేమతో బతికున్న పామును ఆసుపత్రికి తీసుకెళ్లిన నరేందర్ తెగువపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.