ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చడంలో ఆదాయపు పన్నుశాఖ అధికారులది ప్రధాన పాత్ర ఉంటుంది. ఎందుకంటే.. కొందరు ధనవంతులు, బడా వ్యాపారులు ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా తిరుగుతుంటారు. అలాంటి వారిపై దాడులు నిర్వహించి..ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును… వారి నుంచి స్వాధీనం చేసుకుంటారు. అయితే ఇలా తనిఖీలు, నోటీసులు ఇచ్చే కొన్ని సందర్భాలో ఐటీ అధికారులు పొరపాటులు కూడా చేస్తుంటారు. అలానే తాజాగా ఓ వ్యక్తి విషయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు పొరపాటు పడ్డారు. రోజూ వారి కూలీ చేసుకుని జీవిస్తోన్న ఓ వ్యక్తి .. రూ. 14 కోట్ల పన్ను చెల్లించాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులు చూసిన సదరు వ్యక్తి షాకయ్యాడు. అయితే చివరకి తప్పు తెలుసుకున్న అధికారులు అతడి క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వెనుతిరిగారు. ఈ స్టోరీకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బీహార్ రాష్ట్రం రోహాస్త్ జిల్లాకు చెందిన యాదవ్ తన కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. రోజూ వారీ కూలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే అతడికి ఉన్నట్టుండి ఐటీశాఖ అధికారుల నుంచి రూ.14 కోట్లు కట్టాలంటూ నోటీసులు వచ్చాయి. దీంతో అతడి కుటుంబ ఒక్కసారిగా షాక్ గురైంది. వెంటనే తేరుకున్న యాదవ్ ఐటీ అధికారులకు తన కుటుంబ పరిస్థితిని వివరించాడు. తాను కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, తన ఆస్తి పది రెట్లు ఎక్కువకు అమ్మినా అంత డబ్బులు రావని యాదవ్ తెలిపాడు. అంత డబ్బును తాను చెల్లించలేనని అధికారులతో యాదవ్ వాపోయాడు.
అతడి కుటుంబ పరిస్థితి చూసి.. నోటీసులు జారీ చేసేందుకు వచ్చిన అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. ఇక అతడిని పూర్తిగా విచారించిన అధికారులకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. గతంలో యాదవ్ ఢిల్లీ, హర్యానా, పంజాబ్ లలోని వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసినట్లు తెలిసింది. అక్కడ పనులు చేసే సమయంలో తన ఆధార్, పాన్ కార్డు జిరాక్స్ లు ఇచ్చే వాడు. అలానే చాలా కంపెనీల్లో తనకు సంబంధించిన జిరాక్స్ పత్రాలను ఇచ్చేవాడు. 2020లో కోవిడ్ కారణంగా తిరిగి ఇంటికి వచ్చి స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
అయితే అతడు ఇచ్చిన జిరాక్స్ కాఫీలతో ఎవరో నకిలీ అకౌంట్లు తెరచి..లావాదేవీలు జరిపి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. పన్ను ఎగవేసేందుకు ఎవరో ఇలా చేసి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. తన ఆధార్ కార్డు, ఫాన్ కార్డు, ఓటర్ కార్డు జిరాక్స్ లతో ఎవరో మోసానికి పాల్పడి ఉండొచ్చని యాదవ్ కూడా అధికారులకు వివరించాడు. దీంతో యాదవ్ ఎలాంటి మోసాలకు పాల్పడలేదని గుర్తించిన అధికారులు అక్కడ నుంచి వెనుతిరిగారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.