ఓ భర్త తన భార్య కోరికను తీర్చడానికి ఓ గొప్ప పని చేశాడు. భార్య కోసం ఓ కొత్త ఇంటిని ఓడ రూపంలో నిర్మించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
భరించే వాడ్ని భర్త అంటారు.. మరి, భార్య ఇష్టాఇష్టాలను తెలుసుకుని, ఆమె సంతోషం కోసం పాటుపడేవాడిని.. ఉత్తమమైన భర్త అంటారు. అప్పట్లో షాజహాన్ తన భార్య ముంతాజ్ మహాల్ కోరిక మేరకు.. ఆమె గుర్తుగా తాజ్ మహాల్ ని కట్టించాడు. గతంలో చాలా మంది భర్తలు తమ భార్యల మీద ఉన్న ఇష్టాన్ని చాలా రకాలుగా బయటపెట్టారు. ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారు. తాజాగా, తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి తన భార్య ఓడ ఎక్కాలని ఉంది అన్నందుకు ఏకంగా ఓడ లాంటి ఇళ్లును కట్టించాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని కడలూరు జిల్లాకు చెందిన సుభాష్, సుభా శ్రీ భార్యాభర్తలు.
ఈ దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. సుభాష్ గత 15 ఏళ్ల నుంచి మెరైన్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతడు కొన్ని నెలల పాటు సముద్రంలోనే ఉంటూ దేశ దేశాలు చుట్టే వాడు. తర్వాత కొన్ని నెలలు ఇంటికి వచ్చి కుటుంబంతో గడిపేవాడు. భర్త సముద్రంలో నెలల పాటు తిరుగుతుండటంతో సుభాశ్రీకి ఓ వింత కోరిక పుట్టింది. తాను కూడా ఓడలో ఎక్కువ రోజులు ప్రయాణం చేయాలన్న కోరికను భర్తకు చెప్పింది. అయితే, కుటుంబం మొత్తాన్ని కార్గో షిప్లో తీసుకెళ్లటం అసాధ్యం అని అతడికి అర్థం అయింది.
అందుకే ఓ ఇంటిని ఓడ రూపంలో నిర్మించి భార్యకు కానుక ఇవ్వాలని భావించాడు. తన స్వగ్రామంలో కొంత భూమి కొన్నాడు. ఆ భూమిలో ఓడలాంటి ఇంటి నిర్మాణాన్ని చేపట్టాడు. సుభాష్ 2021 లో ఇంటి నిర్మాణం చేపట్టాడు. అదే సంవత్సరంలోనే కట్టడం పూర్తి అయింది. కానీ, రెండేళ్ల తర్వాత.. గత వారం గృహప్రవేశం చేశాడు. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.