కొత్త బంగారు లోకంలో ఒక వ్యక్తి జీవితంలో జరిగే పరిణామాలను ఓ ఫిలాసఫీ రూపంలో చెబుతారు నటుడు రావు రమేష్. అది నిజ జీవితంలో అక్షర సత్యం. టీనేజీలో ఏదైనా చేసేస్తామన్న ఫీలింగ్ లో ఉంటాం, 20 దాటాక ఏదైనా చేయాలన్న కసితో ఉంటారు. ఇక 30 ప్లస్ అయ్యాక ఏదీ వస్తే అది చేసుకుంటూ పోదాం అనుకుంటారు. అదీ కెరీరైనా, పెళ్లైనా. ప్రస్తుతం ఇదే జరుగుతుంది సమాజంలో. 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా అబ్బాయిలు. వీరికి పెళ్లిళ్లు కావడం కష్టంగా మారింది. కొంత మంది బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు. అయితే కుటుంబ బాధ్యతలతో పెళ్లికి దూరమైన ఓ నడి వయస్సు వ్యక్తి.. వధువును చూడాలంటూ ఏకంగా ప్రభుత్వానికే దరఖాస్తు చేశారు. అందులో కొన్ని షరతులు కూడా ఉన్నాయండోయ్
ఈ విస్తుపోయే సంఘటన రాజస్తాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేసింది. ఈ క్రమంంలో దౌసా జిల్లాలోని సికంద్రా ప్రాంతంలోని గంగద్వాడి గ్రామంలో ఈ నెల 3న ఓ సహాయ శిబిరాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే వీరికి ఓ దరఖాస్తు అందింది. అందులో ఓ వ్యక్తి తనకు వధువును వెతికి పెట్టాలంటూ విజ్షప్తి చేశాడు. ఇది చూసిన అధికారులు ఖంగుతిన్నారు. ఇంతకు ఆ అప్లికేషన్ ఎవరిదీ అంటే..కైలాష్ మహావర్ అలియాస్ కల్లు మహావర్ (45) అనే వ్యక్తిది. గంగద్వాడి గ్రామ వాసి అయిన మహావర్‌ది పెద్ద కుటుంబం. ఓ అక్క, ముగ్గురు సోదరులున్నారు. అందరికి పెళ్లిళ్లు కాగా, అతడు మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు.
తమ్ముడి దగ్గర ఉంటూ చిన్న షాపులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు మహవీర్. ఒంటరి జీవితాన్ని గడపలేకపోతున్న మహావీర్.. తనకు వధువును చూడాలంటూ తహశీల్దార్‌కు దరఖాస్తు పెట్టుకున్నాడు. అంతటితో ఆగలేదు. పిల్ల దొరకడమే కష్టమనుకుంటే.. కాబోయే భార్య ఎలా ఉండాలో కూడా చెప్పారు. తనకు కాబోయే భార్య 30 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలని, సన్నగా, నాజుగ్గా కనిపించాలని, ఇంటి పని చక్కగా చేయాలని వంటి కోరికలను అందులోపొందు పరిచారు. అతడి దరఖాస్తును పరిశీలించిన తహసీల్దార్ అతనికి పెళ్లి జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం కైలాష్ మహావర్ అర్జీని గ్రామ కార్యదర్శికి సిఫార్సు చేశారు. ఈ దరఖాస్తు వైరల్ అవుతోంది.