మన దేశంలోని స్త్రీలు అందరికీ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి కోసం ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా మహిళలు అధిక రాబడి పొందొచ్చు.
దేశంలోని మహిళలకు మోడీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్త్రీల సాధికారతే టార్గెట్‌గా తీసుకొచ్చిన కొత్త పథకం ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్’ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నగరాలు, పట్టణాలతో పాటు మారుమూల గ్రామాల్లోని మహిళలకూ ఈ స్కీమ్‌ను చేరువ చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లోనూ మహిళా సమ్మాన్ సేవింగ్స్ అకౌంట్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక మీదట అన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంకులతో పాటు ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఐడీబీఐ లాంటి ప్రైవేటు బ్యాంకుల్లోనూ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్-2023 అకౌంట్స్ తెరవొచ్చని తెలిపింది. ఆయా బ్యాంకులు ఈ పథకాన్ని అందిస్తాయని మోడీ సర్కారు స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం.. మహిళా సమ్మాన్ అకౌంట్‌ను అన్ని ప్రభుత్వ బ్యాంకులతో పాటు ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఐడీబీఐ లాంటి ప్రైవైట్ బ్యాంకులూ అందిస్తాయి.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది స్త్రీల సాధికారత కోసం కేంద్రం తీసుకొచ్చిన వన్ టైమ్ సేవింగ్స్ అకౌంట్. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో వడ్డీ రేటును 7.5 శాతంగా నిర్ణయించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీని లెక్కించి ఖాతాలో జమ చేస్తారు. అకౌంట్ మూసివేసేటప్పుడు అసలుతో పాటు వడ్డీని కలిపి అందిస్తారు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ టెన్యూర్ రెండేళ్లు మాత్రమే ఉంటుంది. ఏప్రిల్ 1, 2023 నుంచి మార్చి 31, 2025 వరకు ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. దేశంలోని స్త్రీలు అందరూ ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. మైనర్లయితే వారి తరఫున గార్డియన్ పేరుపై అకౌంట్ తీసుకోవచ్చు. ఈ ఖాతాలో కనీస డిపాజిట్ రూ.1,000గా ఉండగా.. గరిష్టంగా రూ.2 లక్షల వరకు చేయొచ్చు. ఒక ఏడాది తర్వాత అకౌంట్ నుంచి 40 శాతం వరకు డబ్బుల్ని విత్ డ్రా చేసుకోవచ్చు.