అమ్మ.. ప్రాణాలు పోయేంత బాధని అనుభవించి బిడ్డకి ప్రాణం పోస్తుంది అమ్మ. ఇక అప్పటి నుండి మిగిలిన జీవితం అంతా ఆ బిడ్డ కోసమే బతుకుతుంది. అలాంటి తల్లి ముందే బిడ్డ ప్రాణాలు పోతుంటే.. ఏ అమ్మ చూస్తూ ఊరుకోదు. వచ్చిన ప్రమాదం ఎంత పెద్దది అయినా.. చివరి వరకు పోరాడుతూనే ఉంటుంది. ఇక తాజాగా ఓ అమ్మ తన కూతురు ప్రాణాలను కాపాడుకోవడానికి ఏకంగా పులితోనే పోరాటం చేసింది. ఇప్పుడు ఈ విషయం దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో జునోనా అనే ఓ గ్రామం ఉంది. ఇది ఫారెస్ట్ ఏరియా నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామానికి చెందిన అర్చన మేశ్రం తన ఐదేళ్ల బిడ్డతో ఊరి నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా వీరిపై ఓ చిరుత పులి దాడి చేసింది.చిరుత రావడం రావడంతోనే అర్చన మేశ్రం కూతురుపై దాడి చేసింది. పాప చిన్నది కావడంతో నోట కరుచుకోవడానికి ప్రయత్నించింది. అయితే.., ఆ సమయంలో వీరికి సహాయం చేయడానికి కూడా దగ్గరలో కూడా ఎవ్వరూ లేదు. దీంతో.., తన బిడ్డని కాపుడుకోవడానికి అర్చన మేశ్రం పులితో పోరాటానికి సిద్ధమైంది.
ఆ సమయంలో అర్చనకి ఎలాంటి ఆయుధం దొరకలేదు. దీంతో.., రోడ్డు పక్కనే పడి ఉన్న కట్టెని తీసుకొని ఆమె చిరుతతో చాలా సేపు పోరాడింది. అర్చన మేశ్రం పోరాటానికి పులి సైతం బిత్తరపోయింది. చివరకు చిరుత పాపను వదిలి అడవిలోకి పారిపోయింది. ఇక ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పాపను జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రికి, అక్కడి నుంచి నాగపూర్లోని గవర్నమెంట్ డెంటల్ హాస్పిటల్కు తరలించారు. పాప ట్రీట్మెంట్ కోసం కొంత పరిహారం అందజేసినట్లు ఫారెస్ట్ కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ వీఎం రాయ్ తెలిపారు. మరి తన కూతురి కోసం పులితోనే పోరాటం చేసి గెలిచిన ఈ అమ్మని మీరేమని కీర్తిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.