పాముతో చెలగాటం.. ప్రాణ సంకటం అని అంటారు. విష సర్పాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని.. లేదంటే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని తెలిసిందే. ఇటీవల కొంతమంది పాములతో సెల్ఫీలు తీసుకోబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
ప్రపంచంలో ఇప్పుడు టెక్నాలజీ ఎంతో పెరిగిపోయింది. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ప్రతి ఒక్కరి చేతిలో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ సంగతి ఏమో కానీ.. సెల్ఫీలకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. గుడి, శుభ కార్యాలు, విహారయాత్రలు, స్నేహితులు కలిసినపుడు సెల్పీలు తీసుకోవడం దాన్ని స్టేటస్ గా పెట్టుకోవడం కామన్ అయ్యింది. కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి కృరమృగాలు, విషనాగులు, ప్రమాదకరమైన ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకుంటున్నారు. కొన్నిసార్లు ప్రమాదాలకు గురై చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ యువకుడు పాముతో సెల్ఫీ తీసుకున్నాడు.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే…
మహారాష్ట్ర గడ్చిరోలీ జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో సాయంత్రం సమయంలో గ్రామస్థులకు అరుదైన శ్వేతనాగు కనిపించింది. తెల్లని వర్ణంతో కనిపించిన ఆ పాము చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు గ్రామస్థులు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్నేక్ రెస్క్యూ టీమ్ తో పోలీసులు స్పాట్ కి చేరుకున్నారు. శ్వేతనాగు చాలా అరుదైన పాము అని సమాచారం అందించడం చాలా మంచిదైందని స్నేక్ క్యాచర్ తెలిపారు. ఇక ఆ పామును బంధించే క్రమంలో స్నేక్ టీమ్ సభ్యులు శ్వేతనాగుతో ఫోటోలు దిగారు. ఆ పాము కూడా సెల్ఫీలకు పడగ విప్పి మరీ ఫోజులు ఇచ్చింది. అయితే ఓ వ్యక్తి శ్వేతనాగు కి చాలా సమీపంలో కూర్చొని సెల్ఫీ దిగాడు. ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
శ్వేతనాగుతో సెల్ఫీ తీసుకున్న వ్యక్తి స్నేక్ క్యాచర్ అని తెలుస్తుంది. అందుకే పాము వద్ద చాలా జాగ్రత్తలు తీసుకొని మరీ సెల్ఫీ తీసుకున్నట్లు అర్ధం అవుతుంది. అయితే పాముతో ఇలా సెల్ఫీలు తీసుకోవాలని చూసిన వారు చాలా మంది దానికి కాటుకు బలి అయ్యారు. ఏది ఏమైనా ఇలాంటి సెల్ఫీ కార్యక్రమాలు ప్రాణాలకు ప్రమాదం అని నెటిజన్లు అంటున్నారు. ఆ మద్య తిరుపతి లో పదివేల పాములు పట్టుకున్న భాస్కర్ నాయుడు అనే వ్యక్తి పాము కాటుకి గురై చావు అంచుల వరకు వెళ్లివచ్చారు. ప్రకాశం జిల్లాలో మణికంఠ అనే యువకుడు పామును మెడలో వేసుకొని సెల్ఫీ తీసుకోబోయి దాని కాటుకు గురయ్యాడు. హాస్పిటల్ కి తరలించేలోపు చనిపోయాడు.