ప్రపంచ వ్యాప్తంగా వైద్యరంగం కొత్త పుంతలు తొక్కుతోంది. అందులో భాగంగానే భారతీయ వైద్యరంగం కూడా దూసుకెళ్తోంది. అత్యంత క్లిష్టమైన సర్జరీలను సైతం సులువుగా చేస్తూ ప్రపంచాన్ని భారతీయ డాక్టర్లు అబ్బుర పరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఆపరేషన్ చేసి మహారాష్ట్ర వైద్యులు అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని నందుర్భార్ జిల్లా తలోడాకు చెందిన విలన్ సోమా భిలావే (41) కు ప్రమాదవశాత్తు కంట్లో కత్తి గుచ్చుకుంది. దాంతో వెంటనే అతన్నిహుటాహుటిన ధూలేలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడ్ని పరిశీలించిన వైద్య బృందం పరిస్థితి క్లిష్టంగా ఉందని నిర్ధారించుకున్నారు. దీంతో వెంటనే అతడికి సర్జరీ చేయాలని భావించారు. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేసుకున్నారు.
భిలావే రాత్రి 2.30 గంటలకు ఆసుపత్రిలో చేరగా ఆపరేషన్ కు అన్ని ఏర్పాట్లు చేసి ఉదయాన్నే సర్జరీ చేశారు. బావూసాహెబ్ హీరే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ ఆపరేషన్ జరిగింది. సుదీర్ఘంగా సాగిన ఆపరేషన్ లో డాక్డర్ల బృందం విజయం సాధించింది. ఈ సర్జరీ పై డాక్టర్ ముఖర్రామ్ ఖాన్ మాట్లాడుతూ.. భిలావే కంట్లో కత్తి లోతుగా దిగింది అని గుర్తించాం. ముందుగా దాన్ని మేం చూసి ఏదో లోహపు పదార్థం అని అనుకున్నాం. కానీ సర్జరీ చేసి తీశాక చూస్తే అది 6 అంగుళాల కత్తి అని గుర్తించాం.
ఆపరేషన్ సమయంలో అతడు తీవ్ర నొప్పిని అనుభవించాడు. అలాగే చెవులు, ముక్కు, గొంతుకు ఏమైనా గాయాలు అయ్యాయేమోనని భావించాం.. కానీ లేదు. అత్యంత సవాల్ తో కూడిన ఈ ఆపరేషన్ ను మా బృందం విజయవంతంగా పూర్తి చేసిందని ఆయన తెలిపారు. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అత్యంత క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా చేసిన వైద్య బృందం పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. మరి ఇలాంటి గొప్ప డాక్టర్ల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.