మన దగ్గర సినిమాలు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది. సినిమాల్లో రాణించి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. విజయవంతంగా దూసుకుపోతున్న వారు ఎందరో ఉన్నారు. మహారాష్ట్ర, అమరావతి ఎంపీ నవనీత్ రాణా కూడా ఈ జాబితాలో ఉంటారు. ఇక తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ వివరాలు..
ఎంపీ నవనీత్ రాణా అంటే గుర్తు పట్టడం కష్టం. కానీ గుడ్ బాయ్, శీను వాసంతి లక్ష్మి సినిమాల ద్వారా తెలుగులో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నవనీత్ కౌర్ అనగానే టక్కున గుర్తు పడతారు. యమదొంగ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో కూడా చేసింది. ముంబైకి చెందిన నవనీత్ రాణా.. మళయాళ సినిమాల ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శీను వాసంతి లక్ష్మి చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. చేతన, జగపతి, గుడ్ బాయ్, భూమా వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత 2011లో ఆమె రవి రాణాని వివాహం చేసుకుంది. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. 2019 లోక్‌సభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా అమరావతి నుంచి పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యింది. ఇక తాజాగా ఆమె తన జీవితంలో చోటు చేసుకున్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.
గతంలో తాను జైల్లో ఉన్నప్పుడు ఎంతో టార్చర్ అనుభవించానని.. చెప్పుకొచ్చింది నవనీత్ రాణా. అయితే ఎంత టార్చర్ పెట్టినా.. తనపై తనకున్న నమ్మకాన్ని వదులుకోలేదని స్పష్టం చేశారు. ఇంతకు ఆమె జైలుకు ఎందుకు వెళ్లింది అంటే.. గతేడాది ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. ఆయన ఇంటిముందు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తానని పిలుపునిచ్చింది నవనీత్ రాణా. దాని ప్రకారం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేయడానికి ప్రయత్నిస్తుండగా.. పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ జైలులో తాను ఎన్నో చిత్రహింసలకు గురయ్యానని చెబుతూ నవనీత్ రాణా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
బుధవారం నవనీత్ రాణా పుట్టినరోజు, హనుమాన్ జయంతిసందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె గతేడాది జైలుకు వెళ్లిన సంఘటనను గుర్తుచేసుకున్నారు. జైలులో ఎన్ని చిత్రహింసలు పెట్టినా, వారు మాత్రం తన నమ్మకాన్ని వమ్ము చేయలేకపోయారని వెల్లడించారు. ఆ సమయంలో తన పిల్లలు కూడా ఏం తప్పు చేశావు.. ఎందుకు జైలుకు వెళ్లావని.. ప్రశ్నించేవారని గుర్తు చేసుకున్నారు. అనంతరం ఉద్ధవ్ ఠాక్రేపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు నవనీత్ రాణా. ఆయన పార్టీ, వారి సిద్ధాంతాలను కూడా కాపాడుకోలేక పోయారని ఎద్దేవా చేశారు. సొంత కుమారుడే పార్టీ సిద్ధాంతాలను తుంగలో తొక్కడం చూస్తే.. బాలాసాహెబ్ ఠాక్రే కన్నీరు పెట్టుకునేవారని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.