దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఓం నమః శివాయ, హర హర మహాదేవ్ అంటూ భక్తుల శివనామస్మరణతో ఆలయాలన్నీ మార్మోగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వినూత్న శివాలయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
దేశంలోని అన్నిచోట్ల మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రముఖ శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు పెద్ద ఎత్తున పోటెత్తారు. లింగాకార రూపుడైన శివుడికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్నానపానాదులు ముగించుకుని ఉపవాస దీక్షలు మొదలుపెట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిష్టగా, శ్రద్ధాభక్తులతో కఠోర ఉపవాసం ఉండి సాయంత్రం దీక్షను విడవనున్నారు. రాత్రంతా జాగారం చేస్తూ శివుడ్ని స్మరించుకోనున్నారు.
ఇక, పరమేశ్వరుడి స్వరూపంగా రుద్రాక్షలను నమ్ముతారు. స్వయంగా శివుడి కంటి నుంచి రాలిన నీటి వల్ల ఈ మొక్కలు మొలిచి వాటి నుంచి రుద్రాక్షలు పుట్టాయనేది ప్రతీతి. అలాంటి రుద్రాక్షలతో 31.5 అడుగుల పొడవైన భారీ శివలింగాన్ని గుజరాత్‌లో ప్రతిష్టించారు. గుజరాత్‌లోని ధరంపూర్ లో దాదాపు 31 లక్షల రుద్రాక్షలను వినియోగించి భారీ లింగాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ లింగాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు.
#WATCH | A 31.5 feet tall ‘Rudraksha Shivling’ has been made in Gujarat’s Dharampur by using around 31 lakhs Rudrakshas.#MahaShivaratri pic.twitter.com/60W6416SPi
— ANI (@ANI) February 18, 2023