అవినీతి అనేది ప్రజలను పట్టి పీడిస్తున్నా ఓ భూతం. ఈ అవినీతి వలన న్యాయం జరగాల్సిన ఎంతో మందికి అన్యాయం జరుగుతుంది. దీని వలన సమాజంలో అనిశ్చితి నెలకొంటుంది. ఈ అవినీతి అనేది ప్రభుత్వ శాఖల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందులోనూ ప్రధానంగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖలో ఎక్కువగా ఉంటుందని కొందరి అభిప్రాయం. వారి అభిప్రాయాలకు ఊతమిస్తూ పోలీసుల్లో 90 శాతం మంది అవినీతిపరులే అంటూ తాజాగా చెన్నై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
కోర్టు ఆదేశాలను ఉద్దేశ పూర్వకంగా ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఓ పోలీస్ అధికారిపై చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులపై చెన్నై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “పోలీస్ శాఖలోని 90 శాతం మంది అవినీతిపరులే. వీరిలో స్వతహాగా అవినీతికి పాల్పడే వారు ఉన్నారు. ప్రజాప్రతినిధుల, పై అధికారుల ఒత్తిడితో అవినీతికి పాల్పడే వారూ ఉన్నారు. మిగిలిన 10 శాతం మంది నిజాయితి పరులే అయినా, కేసు విచారణల సమయంలో వారికి పూర్తి స్థాయి సహకారం లభించడం లేదు” అని జస్టిస్ పి. వేల్మురుగన్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణలను జరిపే నైపుణ్యం లేని పోలీసు అధికారులు కూడా డిపార్ట్ మెంట్ లో ఉండి అందరిని ఇబ్బంది పెడుతున్నారని జస్టిస్ పి.వేల్మురుగన్ వ్యాఖ్యానించారు. పోలీస్ విభాగం 90% అవినీతి అధికారులతో పాటు విచారణ చేయడానికి తగిన సామర్థ్యం లేని అధికారులతో నడుస్తోంది మరియు కేవలం 10% మంది మాత్రమే నిజాయితీగా ఉన్నారంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. మరి చెన్నై హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.