Power Cut: దేశంలో కరెంట్ కోతలు ఎక్కువయ్యాయి. దాదాపు 8-9 రాష్ట్రాలు తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆ ప్రాంతాల్లో దాదాపు 7-8 గంటల మేర కరెంట్ కోతలు మామూలైపోయాయి. ఎండాకాలంలో కరెంట్ కోతల కారణంగా ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఆసుపత్రుల్లో సైతం అత్యవసర చికిత్సల సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా, కరెంట్ కోత కారణంగా ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి సమయంలో కరెంట్ పోవటంతో ఒకే సారి జరుగుతున్న రెండు పెళ్లిళ్లలో గందరగోళం నెలకొంది. ఒకరిని చేసుకోవాల్సిన వాళ్లు మరొకరిని పెళ్లి చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన రమేష్ లాల్‌కు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురి పేరు నికిత, చిన్న కూతురి పేరు కరిష్మ. వీరికి రెండు వేరు వేరు కుటుంబాలకు చెందిన థంగ్‌వారా బోలా, గణేష్ అనే ఇద్దరు యువకులతో పెళ్లి నిశ్చయమైంది.
ఈ రెండు పెళ్లిళ్లు ఒకేసారి జరగాలని పెద్దలు నిశ్చయించారు. ఆదివారం రెండు పెళ్లిళ్లు జరుగుతున్నాయి. తాళి కట్టే సమయంలో కరెంట్ పోయింది. పెళ్లి కూతుళ్లు ఇద్దరూ ఒకే డ్రెస్‌లో ఉండటంతో పెళ్లి కుమారుళ్లు కన్‌ఫ్యూజ్ అయ్యారు. చెల్లిని చేసుకోవాల్సిన వాడు అక్కను పెళ్లి చేసుకున్నాడు. అక్కను పెళ్లి చేసుకోవాల్సిన వాడు చెల్లెలిని చేసుకున్నాడు. ఆ చీకట్లో పూజారి కూడా మారిపోయిన జంటలతోనే ఏడడుగులు వేయించాడు. పెళ్లి తంతు అయిపోయిన తర్వాత సదరు పెళ్లి కుమారుళ్లు తమ భార్యలను ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. దీనిపై మూడు కుటుంబాల మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. పెద్దల పంచాయతీతో సద్దుమణిగింది. సోమవారం సరైన జోడీలతో పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. మరి, ఈ వింత సంఘటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Chappals Stolen: రూ.180 ఖరీదైన చెప్పులు పోయాయంటూ రైతు ఫిర్యాదు.. ఆ లాజిక్ కరెక్టే అన్న పోలీసులు!