కాబోయే వధూవరులకు సెళ్లి మీద చాలా ఆశలు ఉంటాయి. తమకున్నంతలో ఎంతో ఘనంగా వివాహం చేసుకోవాలని భావిస్తారు. బాగా డబ్బున్నవాళ్లైతే డెస్టినేషన్ మ్యారేజ్ అంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఆస్పత్రులు కూడా వివాహా వేదికలవుతున్నాయి. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
పెళ్లి అనగానే ఆకాశమంత పందిరి.. భూదేవంతా పీట వేసి.. బంధుమిత్రులందరిని పిలిచి.. అంగరంగ వైభవంగా నిర్వహించే తంతే గుర్తుకు వస్తుంది. ఇక పెద్దల అంగీకారం లేని ప్రేమ పెళ్లిళ్లకు రిజిస్టర్ ఆఫీసులు, ఆర్య సమాజ్‌లు, గుళ్లు.. పెళ్లి మంటపాలు అవుతాయి. సాధారణంగా పెళ్లి మంటపాలు అనగానే ఇవే గుర్తుకు వస్తాయి. అయితే ఈ మధ్య ఆస్పత్రులు కూడా పెళ్లి మంటపాలు అవుతున్నాయి. వివాహానికి ముందు వరుడో, వధువో ఆస్పత్రి పాలైతే.. అశుభం అని భావించకుండా.. ఆస్పత్రిలోనే పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన మరో సంఘటన వెలుగు చూసింది. ఆస్పత్రి బెడ్ మీద ఉన్న వధువుకి.. అలానే తాళి కట్టాడు ఓ వ్యక్తి. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఉజ్జయిని భేరుఘాట్‌కు చెందిన రాజేంద్రకు బర్వాని జిల్లాకు చెందిన శివానితో కొన్ని రోజుల క్రితం వివాహం నిశ్చయమయ్యింది. ఈ నెలలో వారి వివాహం జరగాల్సి ఉంది. అయితే అనుకోకుండా వివాహానికి కొన్ని రోజుల ముందు శివానికి యాక్సిడెంట్ అయ్యింది. ఈ ప్రమాదంలో శివాని తీవ్రంగా గాయపడింది. ఆమె చేతికి, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమెకు ఖండ్వా పట్టణంలోని ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు.
సాధారణంగా పెళ్లికి ముందు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే అశుభం.. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అచ్చి రాదు.. వివాహం రద్దు చేసుకోవడం బెటర్ అనే సలహాలు వినిపిస్తాయి. పెళ్లి జరిగిన తర్వాత కూడా అత్తారింట్లో ఎలాంటి చెడు జరిగినా.. అదంతా కొత్త కోడలు, అల్లుడు వచ్చినా వేళా విశేషం అని సూటి పోటి మాటలు అంటారు. అల్లుడి విషయంలో డైరెక్ట్‌గా బయటకు అనకపోయినా.. అమ్మాయి విషయంలో మాత్రం ముఖం మీదే అనేస్తారు. కానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. కేవలం గాయాలు మాత్రమే అయ్యియి కదా.. పెళ్లి ఎందుకు పోస్ట్ పోన్ చేయాలి అనుకున్నాడు రాజేంద్ర.
ఆస్పత్రిలోనే పెళ్లి చేసుకుంటాను అని తన తల్లిదండ్రులకు, శివాని కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారి అంగీకారంతో ఆస్పత్రి యాజమాన్యం అనుమతితో.. హాస్పిటల్‌లోనే శివాని మెడలో మూడు ముళ్లు వేశాడు. శివాని పెళ్లి కుమార్తెగా అలంకరించుకుని ఆస్పత్రి బెడ్ మీద అలానే పడుకుని ఉండగా.. రాజేంద్ర ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. వీరి పెళ్లికి ఆస్పత్రిలోని వైద్యులు, నర్సులు, ఇంతర సిబ్బంది, అందరూ హాజరయ్యి.. నూతన దంపతులను ఆశీర్వదించారు. రాజేంద్రను ప్రశంసించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.