ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాల సంఖ్య పెరుగుతు పోతుంది. చిన్నాపెద్దా తేడా లేకుండా.. చాలా మంది గుండెపోటు బారిన పడుతున్నారు. తాజాగా శుక్రవారం సినీ నటుడు నందమూరి తారకరత్న.. తీవ్రమైన గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. గుండె పోటు కారణంగా.. 16 ఏళ్ల విద్యార్థిని మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. ఎంతో భవిష్యత్తు ఉందనుకున్న బిడ.. ఇలా చిన్న వయసులోనే గుండెపోటుకు గురవ్వడంతో.. తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఈ విషాదకర సంఘటన వివరాలు..
ఈ విషాదకర సంఘటన మధ్యప్రదేశ్, ఇండోర్‌లో చోటు చేసుకుంది. వ్రిందా త్రిపాఠి అనే 16 ఏళ్ల విద్యార్థిని.. 11వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో శుక్రవారం పాఠశాలలో ఉండగానే వ్రిందా ఉన్నట్లుండి కుప్పకూలింది. క్లాస్ రూమ్‌లో ఉండగానే ఆమెకు గుండెపోటు వచ్చి.. కుప్పకూలింది. వ్రిందాను గమనించిన పాఠశాల యాజమాన్యం.. వెంటనే ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వ్రిందా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. తీవ్రమైన చలి వల్ల వ్రిందా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు.
ఇక తాజాగా డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసరావు కూడా గుండెపోటు కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే చిన్నారులు కూడా ఇలా గుండెపోటుకు గురవ్వడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా గుండెపోటు రావటానికి ‘‘కారణరీ ఆర్టరీ డిసీజ్’’ కారణం అవుతూ ఉంటుంది. దీని వల్ల గుండెకు రక్త ప్రసరణ ఆగిపోయి గుండెపోటు వస్తుంది. మామూలుగా గుండెపోటు వస్తే.. స్టంట్ వేసి ప్రాణాలు నిలపవచ్చు. కానీ, కార్డియాక్ అరెస్ట్ కనుక వస్తే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఈ పరిస్థితిలో ప్రాణాలు కోల్పోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్నవన్ని.. కార్డియాక్ అరెస్ట్‌లే కావడం ఆందోళనకర విషయం.