రాజకీయ నాయకులు అంటే.. ఓట్ల కోసం జనాల చుట్టూ.. చెప్పులరిగేలా తిరుగుతారు. ఒక్కసారి ఎన్నికలు అయిపోయి.. ఫలితాలు వచ్చాక.. మరో ఐదేళ్ల పాటు కంటికి కూడా కనపడరు. ఈ ఐదేళ్ల కాలంలో ప్రజలకు ఎన్ని సమస్యలు వచ్చినా వారికి పట్టదు. ఎన్నికల వేళ ఓట్ల కోసం ప్రజల చుట్టూ తిరిగితే.. ఆ తర్వాత నాయకుల కోసం ప్రజలు పడిగాపులు కాయాలి. అయినా.. సరే వారి దర్శనం లభిస్తుంది అనుకుంటే అత్యాశే అవుతుంది. కానీ ఇప్పుడు మీరు చదవబోయే సంఘటన అందుకు పూర్తి భిన్నం. ఇక్కడ ఓ ఎమ్మెల్యే ప్రజల ఇబ్బంది తీర్చడం కోసం ఏకంగా కరెంటు స్తంభం ఎక్కాడు. దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది. ఆ వివరాలు..
ఈ వింత సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. షెయోపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాబులాల్ జాండెల్.. ఇలా కరెంటు స్తంభం ఎక్కి.. తీగలు తగిలించాడు. ఎందుకు ఇలా అంటే.. మంగళవారం భారత్ జోడో అభియాన్ యాత్రలో భాగంగా ఎమ్మెల్యే కథోడి గ్రామానికి వెళ్లారు. అయితే ఆ సమయంలో కరెంట్ లేకపోవడంతో.. ఏమైందని గ్రామస్తుల్ని అడిగాడు. అప్పుడు వాళ్లు.. కరెంట్ బిల్లులు కట్టలేదని.. అందుకే విద్యుత్‌శాఖ అధికారులు కరెంట్ కట్ చేశారని చెప్పారు. దాంతో ఎమ్మెల్యే మరుసటి రోజు ఉదయమే గ్రామానికి వచ్చాడు. రావడం రావడమే ఊరి చివర ఉన్న విద్యుత్ స్తంభంపైకి ఎక్కి కరెంట్ సప్లై వైర్లను తగిలించి కరెంట్ వచ్చేలా చేశారు.
అయితే ఎమ్మెల్యే తలుచుకుంటే.. అధికారులకు కాల్ చేసి.. కరెంట్ వచ్చేలా చేయగలడు. కానీ ఇక్కడ బాబులాల్ మాత్రం తానే స్వయంగా స్తంభం ఎక్కి కరెంట్ వచ్చేలా చేయడం చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఇక ఎమ్మెల్యే.. కరెంట్ స్తంభం ఎక్కి.. వైర్లు తగిలించే దృశ్యాలను సెల్‌ఫోన్‌లో వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది తెగ వైరలువతోంది.
గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేసిన సిబ్బందికి ఫోన్ చేసిన ఎమ్మెల్యే ఎందుకు అలా చేశారో కారణాలు తెలుసుకున్నాడు. కరెంట్ బిల్లు బకాయిలు చెల్లించే వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయమని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడం వల్లే పవర్ కట్ చేశామని అధికారులు తెలిపారు. దాంతో ఎమ్మెల్యే గ్రామస్తులు పంట అమ్మిన తర్వాత కరెంట్ బిల్లులు చెల్లిస్తారని.. అప్పటి వరకు కరెంట్ కట్ చేయవద్దని అధికారులకు సూచించాడు
ఇదిలా ఉండగా.. గ్రామస్తుల కోసం ఎమ్మెల్యే కరెంట్ స్తంభం ఎక్కడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామస్తుల మెప్పు కోసం స్తంభం ఎక్కావు సరే.. కానీ ప్రమాదవశాత్తు జరగరానిది ఏదైనా జరిగితే అప్పుడు ఏంటి పరిస్థితి అని కొందరు నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే బాబులాల్ ఇలాంటి సాహసాలు చేయడం ఇదే మొదటి సారు కాదట.. గతంలో ఓ సారి గేటు పగలగొట్టి చంబల్ కాలువలో దూకి జైలుకు కూడా వెళ్లిన విషయాన్ని నియోజకవర్గ ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.