ఈమధ్య కాలంలో.. గుండెపోటుకు గురై.. ఆకస్మాత్తుగా మృతి చెందుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అయితే ఆశ్చర్యం కొద్ది చిన్నారులు కూడా ఇలా గుండెపోటు బారిన పడటం కలవర పెడుతోంది. కొన్ని రోజుల క్రితం స్కూల్ ప్రార్థనలో ఉన్న బాలుడు కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యి.. కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ కోవకు చెందిన సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. స్కూల్ అయిపోయి.. ఇంటికి వెళ్లేందుకు బస్సు ఎక్కిన కుర్రాడు.. కార్డియాక్ అరెస్ట్‌కు గురయి మృతి చెందాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ భింద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
భింద్ ప్రాంతానికి చెందిన మనీశ్ జాటవ్ స్థానిక పాఠశాలలో నాలగవ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం లంచ్ బ్రేక్‌లో మనీశ్.. తన సోదరుడితో కలిసి భోజనం పూర్తి చేశాడు. ఆ తర్వాత.. 2 గంటలకు క్లాస్‌లు అయిపోయిన తర్వాత.. ఇంటికి వెళ్లేందుకు.. సోదరుడితో కలిసి స్కూల్ బస్ ఎక్కాడు. ఆ వెంటనే ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన వెంటనే బస్ డ్రైవర్.. స్కూల్ యాజమాన్యానికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. వెంటనే వారు హుటాహుటిన మనీశ్‌ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మనీశ్ మృతి చెందాడు.
ఈ సందర్భంగా బాలుడికి చికిత్స చేసిన వైద్యులు మాట్లాడుతూ.. ‘‘మనీశ్‌ని ఆస్పత్రికి తీసుకువచ్చేసరికి.. అతడు ప్రాణాలతో లేదు. సీపీఆర్ చేసినా.. అతడిని కాపాడలేకపోయాం. ఇక ప్రాథమిక లక్షణాలు చూస్తుంటే.. మనీశ్ కార్డియాక్ అరెస్ట్‌కు గురయినట్లు తెలుస్తోంది’’ అని వెల్లడించారు. అయితే కరోనా తర్వాత ఇలాంటి కేసులు పెరుగుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. అయితే చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్ రావడం.. మాత్రం కాస్త ఆందోళన కలిగిస్తోంది.. ఇక మధ్యప్రదేశ్‌లో ఇదే తొలి కేసు కావడం గమనార్హం అంటున్నారు వైద్యులు. ఇక తన కుమారుడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని మనీశ్ తండ్రి తెలిపాడు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.